Ali Khamenei: ఇరాన్‌లో మిన్నంటిన నిరసనలు: ఖమేనీ ఫోటోలతో సిగరెట్లు వెలిగిస్తున్న మహిళలు

Iran Protests Women Burn Khamenei Photos Smoke Cigarettes
  • ప్రాణాలు పోతున్నా తగ్గని ఉద్యమ హోరు
  • ఇప్పటివరకు 60 మందికి పైగా మృతి
  • హిజాబ్ నిబంధనలు, ఆర్థిక సంక్షోభంపై మహిళల ఆగ్రహం
  • దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్
  • ప్రతిఘటించే వారిని చంపేస్తే దాడి చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
  • నిరసనకారులను ‘విధ్వంసకారులు’గా అభివర్ణించిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీ
ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం (1979) తర్వాత ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రజా తిరుగుబాటు కనిపిస్తోంది. కేవలం ఆర్థిక కష్టాలకే పరిమితం కాకుండా, ప్రస్తుత పాలనా వ్యవస్థపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ మహిళలు తమ నిరసనను వినూత్నంగా, అత్యంత సాహసోపేతంగా తెలుపుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫోటోలను తగులబెట్టి, ఆ మంటలతో మహిళలు సిగరెట్లు వెలిగిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇరాన్ చట్టాల ప్రకారం సుప్రీం లీడర్ ఫోటోలను అవమానించడం మరణశిక్ష పడేంతటి నేరం. అలాగే మహిళలు బహిరంగంగా పొగతాగడంపై కూడా అక్కడ సామాజిక ఆంక్షలు ఉన్నాయి. ఈ రెండు నిబంధనలను ఒకేసారి ఉల్లంఘించడం ద్వారా మహిళలు తమపై ఉన్న పాలకుల ఉక్కుపాదాన్ని ధిక్కరిస్తున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. టెహ్రాన్ వీధుల్లో మహిళలు తమ హిజాబ్‌లను తగులబెట్టి భారీ ఆ కాంతుల మధ్య నాట్యం చేస్తున్న దృశ్యాలు నిరసన తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమైన ఈ నిరసనలపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జనవరి 10 నాటి నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 60 మందికి పైగా నిరసనకారులు మరణించగా, 2,300 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఇంటర్నెట్‌ను పూర్తిగా నిలిపివేసి, బాహ్య ప్రపంచంతో సంబంధాలను తెంచేసింది. అయినప్పటికీ ప్రజలు ఇళ్లపై నుంచి ఖమేనీ వ్యతిరేక నినాదాలు చేస్తూనే ఉన్నారు.

ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. "ఇరాన్ ప్రభుత్వం తన ప్రజలను చంపడం ప్రారంభిస్తే, మేము ఊరుకోము. చాలా తీవ్రంగా దాడి చేస్తాం" అని హెచ్చరించారు. అయితే ఇది అమెరికా పన్నుతున్న కుట్ర అని ఖమేనీ కొట్టిపారేశారు. ట్రంప్‌ను ‘దౌర్భాగ్యుడు’గా అభివర్ణిస్తూ త్వరలోనే ఆయన పతనం తప్పదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలు కూడా ఇరాన్ ప్రభుత్వ హింసాత్మక చర్యలను ఖండిస్తూ సంయమనం పాటించాలని కోరాయి.
Ali Khamenei
Iran protests
Iran supreme leader
Iran women
Khamenei photo burning
Iran hijab protests
Donald Trump Iran
Iran government crackdown
Tehran protests
Iran political unrest

More Telugu News