Donald Trump: భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. నాకు నోబెల్ రావాలి: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump claims he stopped India Pakistan war wants Nobel
  • తన జోక్యం వల్లే కోటి మంది ప్రాణాలు దక్కాయన్న ట్రంప్
  • 8 దేశాల మధ్య యుద్ధాలను పరిష్కరించినా గుర్తింపు దక్కలేదని ఆవేదన
  • ట్రంప్ వ్యాఖ్యలను పలుమార్లు ఖండించిన భారత్
  • పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డ భారత్ సైన్యం
భారత్-పాకిస్థాన్ మధ్య 2025లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను తానే అడ్డుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. వైట్‌హౌస్‌లో చమురు సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన జోక్యం లేకపోతే ఇరు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేదని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ప్రధాని స్వయంగా తన వద్దకు వచ్చి.. ట్రంప్ చొరవ వల్ల కనీసం కోటి మంది ప్రాణాలు దక్కాయని బహిరంగ ప్రకటన చేశారని ఆయన గుర్తుచేశారు.

తన హయాంలో ఇప్పటివరకు ఎనిమిది పెద్ద యుద్ధాలను పరిష్కరించానని ట్రంప్ చెప్పుకొచ్చారు. "చరిత్రలో నాకంటే ఎక్కువగా నోబెల్ శాంతి బహుమతికి అర్హులు ఎవరూ లేరు. 30 ఏళ్లుగా నలుగుతున్న సమస్యలను కూడా నేను పరిష్కరించాను. భారత్-పాక్ మధ్య అప్పటికే ఎనిమిది యుద్ధ విమానాలు కూలిపోయాయి, పరిస్థితి అదుపు తప్పుతున్న వేళ నేను రంగంలోకి దిగి యుద్ధం రాకుండా ఆపాను" అని వివరించారు. శాంతి బహుమతుల కంటే ప్రాణాలు కాపాడటమే తనకు ముఖ్యమని, తాను కోట్ల మందిని కాపాడానని పేర్కొన్నారు.

అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ మొదటి నుంచీ ఖండిస్తూనే ఉంది. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్ మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాక్ భూభాగంలోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారత సైనిక సత్తాకు భయపడి మే 10న పాక్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీఎంవో) స్వయంగా భారత అధికారులను సంప్రదించి కాల్పుల విరమణ కోరారని భారత్ చెబుతోంది. ఇందులో మూడో పక్షం జోక్యం ఏమీ లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేస్తోంది.
Donald Trump
India Pakistan
India Pakistan war
Nobel Peace Prize
Operation Sindoor
Pakistan DGMO
Pahalgam attack
Nuclear war
Terrorist infrastructure

More Telugu News