Mahua Moitra: ఐ-ప్యాక్‌పై ఈడీ దాడులు ‘రాజకీయ గూఢచర్యం’: కేంద్రంపై మహువా మోయిత్రా నిప్పులు

Mahua Moitra Slams ED Raids on I PAC as Political Espionage
  • బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రతిపక్షాలను భయపెట్టేందుకే సోదాలంటూ ధ్వజం
  • పార్టీ అంతర్గత సమాచారం దొంగిలించేందుకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని ఆరోపణ
  • ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్యను సమర్థించిన టీఎంసీ ఎంపీ
పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్, దాని చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంపై ఈడీ జరిపిన సోదాలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ‘ఆయుధాలు’గా వాడుకుంటోందని ఆమె ఆరోపించారు. బీజేపీ సాగిస్తున్న ‘దోపిడీ, గూండాయిజం’ను ఎదుర్కొంటున్న ఏకైక నాయకురాలు మమతా బెనర్జీ మాత్రమేనని ఆమె కొనియాడారు.

ఈడీ దాడులు జరుగుతున్న ప్రదేశానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా వెళ్లడాన్ని మహువా మోయిత్రా సమర్థించారు. "ముఖ్యమంత్రి మా పార్టీకి కూడా అధినేత. ఇంట్లో దొంగతనం జరుగుతున్నప్పుడు మన వస్తువులను కాపాడుకునే హక్కు మనకు ఉంటుంది" అని ఆమె పేర్కొన్నారు. ఈ సోదాలను ‘రాజకీయ దొంగతనం, గూఢచర్యం’గా అభివర్ణించిన ఆమె, ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల జాబితా వంటి రహస్య డేటాను దొంగిలించేందుకే ఈడీని పంపారని దుయ్యబట్టారు. ఆరు, ఏడేళ్ల నాటి బొగ్గు కుంభకోణం కేసును ఇప్పుడు ఎన్నికల ముందు తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు.

బీజేపీలో చేరిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేతల కేసులన్నీ ఏమయ్యాయని మహువా నిలదీశారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, అజిత్ పవార్ వంటి నేతల పేర్లను ప్రస్తావిస్తూ.. కేవలం ప్రతిపక్ష నాయకులనే లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని భయపెట్టాలని చూస్తే బెంగాల్ పులి (మమతా బెనర్జీ) తగిన బుద్ధి చెబుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ దాడులకు నిరసనగా మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ పాదయాత్ర నిర్వహించగా, ఢిల్లీలో నిరసన చేపట్టిన టీఎంసీ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, తమ దర్యాప్తును ముఖ్యమంత్రి అడ్డుకున్నారని ఈడీ, తమ పార్టీ సమాచారాన్ని అక్రమంగా సేకరించారని టీఎంసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి. కోర్టులో గందరగోళ పరిస్థితుల కారణంగా ఈ కేసు విచారణను న్యాయస్థానం జనవరి 14కు వాయిదా వేసింది.
Mahua Moitra
I-PAC
Prateek Jain
Mamata Banerjee
Enforcement Directorate
TMC
West Bengal Politics
Political Espionage
ED Raids
Amit Shah

More Telugu News