Telangana Transport Department: సంక్రాంతి రద్దీతో కాసుల వేట... ట్రావెల్స్ బస్సులపై కేసులు

Telangana Transport Department Cracks Down on Private Travels During Sankranti
  • ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూళ్లు చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు
  • నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ 
  • 75 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసిన రవాణా శాఖ అధికారులు
సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకుని నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తెలంగాణ రవాణా శాఖ ఉక్కుపాదం మోపుతోంది. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యజమానులు ప్రయాణికుల నుంచి టికెట్ ధరలు పెంచి వసూళ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సులపై జనవరి 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఇప్పటివరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సుమారు 75 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రయాణికుల భద్రతను విస్మరించి బస్సుల్లో అధికంగా సరుకు రవాణా చేయడం, ప్రయాణికుల వివరాలతో కూడిన జాబితాను నిర్వహించకపోవడం, అత్యవసర సమయంలో అవసరమైన ఫస్ట్‌ ఎయిడ్ బాక్సులను అందుబాటులో ఉంచకపోవడం వంటి పలు ఉల్లంఘనలను రవాణా శాఖ గుర్తించింది. పండుగ సీజన్ ముగిసే వరకు ప్రైవేట్ ఆపరేటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించిన రవాణా శాఖ, నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది. ఇందుకోసం ఎనిమిది ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల రవాణా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, ఎక్కడా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

పండుగ సమయంలో ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా అధిక ఛార్జీలు వసూలు చేయడంపై రవాణా శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక ఛార్జీలు వసూలు చేయరాదని తెలిపింది. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారేజీలుగా మార్చి ప్రతి స్టాప్‌లో ప్రయాణికులను ఎక్కించుకోవడం నిషిద్ధమని స్పష్టం చేసింది. ఉల్లంఘనలకు పాల్పడే ట్రావెల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలతో పాటు అవసరమైతే లైసెన్సుల రద్దుకూ వెనుకాడబోమని హెచ్చరించింది.

ఇదిలా ఉండగా, స్లీపర్ బస్సుల నిర్వహణపై కూడా రవాణా శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. స్లీపర్ బస్సుల భద్రత, నిర్వహణకు సంబంధించి త్వరలోనే నూతన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని తెలంగాణలో రాకపోకలు సాగిస్తున్న స్లీపర్ బస్సుల బాడీ బిల్డింగ్‌, సాంకేతిక ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 
Telangana Transport Department
Sankranti
private travels
bus tickets
bus fares
Hyderabad
Rangareddy
sleeper buses
bus safety
traffic rules

More Telugu News