Ajit Pawar: ఎన్సీపీ (శరద్ పవార్)తో వివాదం ముగిసిందన్న అజిత్ పవార్.. రేపు ఒకే వేదికపై సుప్రియా, అజిత్

Ajit Pawar Says NCP Dispute Over Supriya Ajit on Same Stage
  • పింప్రి చించ్వాడ్‌లో కలిసి పోటీ చేయాలని ఎన్సీపీ, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీ నిర్ణయం
  • ఇరువర్గాలు కలిసి పనిచేసే విషయాన్ని ధృవీకరించిన సుప్రియాసూలే
  • వివాదాలు ముగిసిపోయాయన్న అజిత్ పవార్
మహారాష్ట్రలో రెండేళ్ల క్రితం చీలిపోయిన 'ఎన్సీపీ'... స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయనుంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇరువర్గాలు కలిసి పనిచేసే విషయాన్ని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీ సుప్రియా సూలే ధృవీకరించారు.

పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సుప్రియా సూలే తెలిపారు. అయితే ఈ భాగస్వామ్యం కొనసాగించే అంశంపై ఇంకా ఎలాంటి చర్చ జరగలేదని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా చేరుతానంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తనపై నిరాధారమైన ప్రచారం చేస్తూ ఆనందం పొందే వారిని అలాగే ఉండనీయండని ఎద్దేవా చేశారు.

రెండు పార్టీల కార్యకర్తల అభీష్టం మేరకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. పవార్ కుటుంబంలో వివాదాలు ముగిసిపోయాయని ఆయన పేర్కొన్నారు.

శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిపోయిన విషయం విదితమే. అజిత్ పవార్ నేతృత్వంలోని చీలిక వర్గం ఎన్డీయేతో కలవగా, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్ పవార్) ఇండియా కూటమితో జత కలిసింది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు ఎన్డీయే, ఇండియా కూటమి నుంచి వేర్వేరుగా బరిలోకి దిగాయి.

ఇదిలా ఉండగా, అజిత్ పవార్, సుప్రియా సూలే కలిసి పుణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రెండు పార్టీల తరఫున ఉమ్మడి మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు. ఇరు పార్టీలుగా విడిపోయిన తర్వాత వీరిద్దరు ఒకే వేదికపై కలవడం ఇదే మొదటిసారని ఎన్సీపీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ ప్రదీప్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ మేనిఫెస్టో ఆవిష్కరణకు సుప్రియా సూలేతో పాటు ఆమెపై ఎన్సీపీ తరఫున పోటీ చేసిన అమోల్ కూడా హాజరు కానున్నారు.
Ajit Pawar
NCP
Sharad Pawar
Supriya Sule
Maharashtra Politics
Pimpri Chinchwad Municipal Corporation Elections

More Telugu News