Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్'కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... టికెట్ రేట్ల పెంపునకు అనుమతి

Chiranjeevi Mana Shankara Varaprasad Garu Gets AP Government Green Light for Ticket Hike
  • మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మన శంకర వరప్రసాద్ గారు చిత్రం
  • జనవరి 12న రిలీజ్
  • టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ సర్కారు ప్రత్యేక ఉత్తర్వులు
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ జీవో ప్రకారం, సినిమా విడుదలయ్యే జనవరి 12కు ముందు రోజు, అంటే జనవరి 11 ఆదివారం రాత్రి ప్రదర్శించే పెయిడ్ ప్రీమియర్ షోలకు టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ. 500 వరకు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించారు. ఇక విడుదలైన మొదటి 10 రోజుల పాటు పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి. సింగిల్ స్క్రీన్లలో రూ. 100 (జీఎస్టీతో కలిపి మొత్తం టికెట్ ధర రూ. 247), మల్టీప్లెక్స్‌లలో రూ. 125 (జీఎస్టీతో కలిపి మొత్తం టికెట్ ధర రూ. 302) పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇదే కాలంలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.

'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నయనతార హీరోయిన్‌గా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చగా, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు నిర్ణయం కచ్చితంగా కలిసొస్తుందని, భారీ వసూళ్లు సాధించేందుకు దోహదపడుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటే, బాక్సాఫీస్ వద్ద చిరంజీవి మరో భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
Chiranjeevi
Mana Shankara Varaprasad Garu
Anil Ravipudi
Nayanthara
AP Government
Movie Ticket Hike
Sankranti Release
Tollywood
Bheems Ceciroleo
Sahu Garapati

More Telugu News