Indian Railways: దేశంలో 549 రైళ్ల వేగాన్ని పెంచిన రైల్వే శాఖ

Indian Railways Increases Speed of 549 Trains
  • దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వే శాఖ
  • కొత్త టైమ్‌టేబుల్‌లో పలు రైళ్ల వేగాన్ని పెంచుతున్నట్లు ప్రకటన
  • మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు
  • సౌత్ వెస్ట్రన్ రైల్వేలో అత్యధికంగా 117 రైళ్ల వేగం పెంపు
  • ప్రయాణికులకు వేగవంతమైన సేవలే లక్ష్యమన్న రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు, ఇప్పటికే నడుస్తున్న 549 రైళ్ల వేగాన్ని పెంచినట్లు శుక్రవారం ప్రకటించింది. రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేస్తూ విడుదల చేసిన కొత్త టైమ్‌టేబుల్ ఆఫ్ ట్రైన్స్-2026లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

కొత్త రైళ్లతో పాటు 86 రైళ్ల సర్వీసులను పొడిగించడం, 10 రైళ్లను సూపర్‌ఫాస్ట్‌గా మార్చడం, 8 రైళ్ల ఫ్రీక్వెన్సీని (ట్రిప్పుల సంఖ్య) పెంచడం వంటి చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఈ మార్పులతో రైళ్ల రాకపోకల్లో కచ్చితత్వం పెరిగి, ప్రయాణ సమయం తగ్గనుంది.

వివిధ జోన్ల వారీగా చూస్తే... సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) పరిధిలో అత్యధికంగా 117 రైళ్ల వేగాన్ని పెంచారు. ఈ జోన్‌లోనే 8 రైళ్లను సూపర్‌ఫాస్ట్‌గా మార్చారు. ఇక సదరన్ రైల్వే (SR)లో 75 రైళ్ల వేగం పెరగగా, 6 కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు. అదేవిధంగా నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) పరిధిలో 89, వెస్ట్రన్ రైల్వే (WR)లో 80 రైళ్ల వేగాన్ని పెంచారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నార్తర్న్ రైల్వే జోన్లలో అత్యధికంగా చెరో 20 కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు.

ఈ మార్పుల ద్వారా రైళ్ల కార్యకలాపాల సామర్థ్యం మెరుగుపడుతుందని, ప్రయాణికులకు మరింత వేగవంతమైన, నమ్మకమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
Indian Railways
Railways
Indian Railway Update
New Trains
Train Speed
Time Table of Trains 2024
South Western Railway
Southern Railway
North Western Railway
Western Railway

More Telugu News