Rajya Sabha: ఈ ఏడాది తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ ఎంపీల రిటైర్మెంట్

Rajya Sabha MPs from Telangana AP to Retire This Year
  • బీఆర్ఎస్ నుంచి సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను ఏప్రిల్ 9న రిటైర్
  • ఏపీ నుంచి అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ సత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీశ్ జూన్‌లో రిటైర్
  • 2026లో ఖర్గే సహా రిటైర్ కానున్న 73 మంది రాజ్యసభ ఎంపీలు
ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు ఎంపీలు పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం ఈ సంవత్సరం రిటైర్ కాబోయే రాజ్యసభ సభ్యుల జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ఏప్రిల్ 9న రిటైర్ కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ సభ్యుడు సానా సతీశ్‌కు జూన్‌లో రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది.

రాజ్యసభ నుంచి 2026లో మొత్తం 73 మంది రిటైర్ కానున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరీ, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్‌ల పదవీ కాలం ముగుస్తుంది. పెద్దల సభలో ఖర్గే ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు మరోసారి అవకాశం దక్కవచ్చు.

మహారాష్ట్ర నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు, ఒడిశా నుంచి నలుగురు, పశ్చిమ బెంగాల్ నుంచి ఐదుగురు, అసోం నుంచి ముగ్గురు, బీహార్ నుంచి ఐదుగురు, ఛత్తీస్‌గఢ్ నుంచి ఇద్దరు, హర్యానా నుంచి ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒకరు, గుజరాత్ నుంచి నలుగురు, ఝార్ఖండ్ నుంచి ఇద్దరు, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు, రాజస్థాన్ నుంచి ముగ్గురు, ఉత్తర ప్రదేశ్ నుంచి పదిమంది, కర్ణాటక నుంచి నలుగురు, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒక్కరు చొప్పున రిటైర్ కానున్నారు.
Rajya Sabha
Telangana
Andhra Pradesh
MPs Retirement
Suresh Reddy
Abhishek Manu Singhvi

More Telugu News