Revanth Reddy: చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా: వివాదాలపై రేవంత్ రెడ్డి కీలక సూచన

Revanth Reddy Appeals to Chandrababu on Water Disputes
  • జల వివాదాలను మనమే పరిష్కరించుకుందామన్న రేవంత్ రెడ్డి
  • రాజకీయాలకు అతీతంగా నీళ్ల సమస్యను పరిష్కరించుకుందామని వ్యాఖ్య
  • కోర్టుల్లో కాకుండా మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామని స్పష్టీకరణ
  • ఏపీ ఒక అడుగు వేస్తే, తెలంగాణ పది అడుగులు వేస్తుందన్న రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. జల వివాదాలను పరస్పరం కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుందామని అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా నీటి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

కోర్టుల ద్వారా కాకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. పంచాయితీ కావాలా, నీళ్లు కావాలా అని నన్ను అడిగితే తెలంగాణకు నీళ్లు కావాలని చెబుతానని, అదే సమయంలో వివాదాలు కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలని స్పష్టంగా చెబుతానని ఆయన అన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ వేడుక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానని, కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. అలా అడ్డంకులు కలిగిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని, దీనివల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము వివాదాలు కోరుకోవడం లేదని, పరిష్కారం మాత్రమే కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. తమకు కావలసింది రాజకీయ ప్రయోజనాలు కాదని, ప్రజల ప్రయోజనాలని అన్నారు.

తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ ఉండాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాల్సిందే అన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించారు. జల వివాదాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక్క అడుగు ముందుకు వేస్తే తాము 10 అడుగులు ముందుకు వేస్తామని ఆయన అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన రాష్ట్రమని అన్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు మన దేశానికి చెందిన వారే సీఈవోలుగా ఉన్నారని ఆయన తెలిపారు.
Revanth Reddy
Chandrababu Naidu
Telangana
Andhra Pradesh
Krishna River
Water Disputes

More Telugu News