Alcohol: అతిగా ఒక్కసారి తాగినా పేగులకు తీవ్ర నష్టం!

Alcohol Binge Drinking Seriously Damages Gut Health Study Reveals
  • అతిగా మద్యం సేవిస్తే 'లీకీ గట్
  • హార్వర్డ్ అధ్యయనంలో కీలక విషయాలు
  • కాలేయ సంబంధిత వ్యాధులకు ఇదే తొలి అడుగు కావొచ్చని హెచ్చరిక
అప్పుడప్పుడు పార్టీలలోనో, స్నేహితులతో కలిసినప్పుడో ఒక్కసారి అతిగా మద్యం తాగితే ఏమీ కాదనుకుంటే పొరపాటే. ఒకే ఒక్కసారి పరిమితికి మించి మద్యం సేవించినా మన పేగుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. సుమారు రెండు గంటల వ్యవధిలో మహిళలు నాలుగు, పురుషులు ఐదు పెగ్గులు తీసుకోవడాన్ని 'బింజ్ డ్రింకింగ్'గా పరిగణిస్తారు. ఇలా ఒక్కసారి చేసినా ప్రమాదమేనని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.

హార్వర్డ్ మెడికల్ స్కూల్, బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం, అతిగా మద్యం సేవించినప్పుడు పేగుల గోడలు బలహీనపడి, హానికరమైన బ్యాక్టీరియా, విష పదార్థాలు (టాక్సిన్స్) రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఈ పరిస్థితినే 'లీకీ గట్' అని పిలుస్తారు. ఈ అధ్యయన వివరాలు 'ఆల్కహాల్: క్లినికల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ రీసెర్చ్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఈ విషయంపై హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ గ్యాంగీ సాబో మాట్లాడుతూ, "ఒక్కసారి అతిగా తాగినా అది పేగులలో వాపును ప్రేరేపించి, వాటి గోడలను బలహీనపరుస్తుందని మా అధ్యయనంలో వెల్లడైంది. ఆల్కహాల్ సంబంధిత పేగు, కాలేయ వ్యాధులకు ఇది తొలి దశ కావొచ్చు" అని వివరించారు.

అతిగా మద్యం తాగినప్పుడు మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్పందిస్తుందని, ముఖ్యంగా 'న్యూట్రోఫిల్స్' అనే కణాలు పేగుల పైపొరను దెబ్బతీసే వల లాంటి నిర్మాణాలను విడుదల చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. అయితే, ఒక ఎంజైమ్‌తో ఈ నిర్మాణాలను నిరోధించినప్పుడు పేగులకు నష్టం తగ్గడం, బ్యాక్టీరియా లీకేజీ అదుపులోకి రావడం గమనించారు. ఇది భవిష్యత్తులో ఆల్కహాల్ సంబంధిత నష్టాన్ని తగ్గించే చికిత్సలకు మార్గం చూపవచ్చని భావిస్తున్నారు.
Alcohol
Binge drinking
Gut health
Leaky gut
Harvard Medical School
Intestinal damage
Alcohol research
Alcohol consumption
Neutrophils
Liver diseases

More Telugu News