Chandrababu Naidu: మన భూములపై ఆయన ఫొటో ఏంటి?: రాయవరంలో సీఎం చంద్రబాబు ఫైర్

Chandrababu Naidu fires on previous government land policies in Rayavaram
  • తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో సీఎం చంద్రబాబు పర్యటన
  • రాజముద్రతో కూడిన 'మీ భూమి - మీ హక్కు' పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ ప్రారంభం
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూములు కాజేసేందుకు గత ప్రభుత్వం కుట్ర పన్నిందన్న చంద్రబాబు 
  • వివాదాస్పద చట్టాన్ని రద్దు చేస్తూనే రెండో సంతకం పెట్టానని వెల్లడి
  • ఇకపై భూ రికార్డులను ట్యాంపర్ చేయకుండా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భద్రత
గత ప్రభుత్వ అస్తవ్యస్త, వివాదాస్పద భూ విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల భూములను కాజేసేందుకే ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తీసుకొచ్చారని, అందుకే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని రద్దు చేస్తూ రెండో సంతకం పెట్టానని స్పష్టం చేశారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసి, వాటిపై ఉన్న క్యూఆర్ కోడ్, సాంకేతికతను స్వయంగా పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. "మన పూర్వీకులు కష్టపడి సంపాదించిన, మన స్వార్జితమైన భూమిపై ఆయన (జగన్) ఫొటో ఏమిటి? సరిహద్దు రాళ్లపై ఆయన ముద్రలు వేయడమేంటి? అని గతంలోనే ప్రశ్నించాను. ఇది అహంకారానికి నిదర్శనం" అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోయుంటే, ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో ప్రజల భూములన్నీ తమకు నచ్చిన వారికి కట్టబెట్టేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. 

"నిన్నామొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు చాలా ప్రమాదకరమైన ఆలోచన చేశారు. మీ భూముల వివరాలన్నీ వారి అనుచరులు అమెరికాలో పెట్టుకున్నారు. ప్రజలు సరైన సమయంలో బ్యాలెట్ ద్వారా తగిన బుద్ధి చెప్పారు" అని అన్నారు.

భూమి అంటే రైతుకు కేవలం ఆస్తి కాదని, అదొక విశ్వాసం, కుటుంబంతో పెనవేసుకుపోయిన సెంటిమెంట్ అని చంద్రబాబు పేర్కొన్నారు. కరోనా సమయంలో అందరూ సెలవులు తీసుకున్నా, దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం సెలవు లేదని గుర్తుచేశారు. 

గత పాలకుల తీరు వల్ల తాను ఎక్కడికి వెళ్లినా భూ వివాదాలకు సంబంధించిన పిటిషన్లే ఎక్కువగా వస్తున్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ కరణం, మునసబు వ్యవస్థను రద్దు చేసి రైతులకు మేలు చేస్తే, తెలంగాణలో పండుగ చేసుకున్నారని, కానీ మన రాష్ట్రంలో కొందరు దానిని వ్యతిరేకించారని గుర్తుచేశారు.

ఇకపై భూ వివాదాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో రికార్డులను పక్కాగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. "తహసీల్దారు కార్యాలయంలో కాదు, గ్రామసభలు నిర్వహించి, ప్రజల మధ్యనే పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించాను. పద్ధతి ప్రకారం రీసర్వే చేయించి, రికార్డులను ట్యాంపర్ చేయడం అసాధ్యమయ్యేలా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. పాస్‌బుక్‌పై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు, మీ భూమి వివరాలన్నీ క్షణాల్లో కనిపిస్తాయి" అని వివరించారు. 

ఈ రాజముద్రతో కూడిన పాస్‌పుస్తకాలను రైతులకు, భూ యజమానులకు సత్వరమే అందించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
Chandrababu Naidu
Rayavaram
Land Titling Act
Jagan Mohan Reddy
Andhra Pradesh Land
మీ భూమి - మీ హక్కు
Land disputes
Passbooks
Blockchain technology
Farmer welfare

More Telugu News