Bhuma Karunakar Reddy: దూరంగా ఉన్న ఫుటేజీ కాదు... దగ్గరగా ఉన్న కెమెరాల ఫుటేజీ విడుదల చేయండి: భూమన
- తిరుమలలో మద్యం బాటిళ్ల ఘటన
- వైసీపీ కార్యకర్త, ఒక మీడియా ప్రతినిధిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఈ వ్యవహారంలో వైసీపీ పాత్ర లేదన్న భూమన
తిరుమలలో మద్యం బాటిళ్లు లభ్యమైన ఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసి, వైసీపీకి చెందిన కోటి అనే కార్యకర్తతో పాటు ఒక మీడియా ప్రతినిధిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అరెస్టైన కోటి... టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర రెడ్డి అనుచరుడేనని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం బాటిళ్ల ఘటన పూర్తిగా వైసీపీ కుట్రేనంటూ విమర్శలు చేస్తున్నారు.
ఈ ఆరోపణలపై భూమన కరుణాకర రెడ్డి స్పందించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోంది కూటమి ప్రభుత్వమేనని ఆయన తీవ్రంగా ఆరోపించారు. మద్యం బాటిళ్ల వ్యవహారంలో వైసీపీకి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేస్తూ, తప్పుడు కేసులు బనాయించి వైసీపీ నేతలు, కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 152 కింద కేసు పెట్టడం అత్యంత దారుణమని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ ఉన్నందువల్లే ఇప్పటికైనా న్యాయం దొరుకుతోందని, లేదంటే వైసీపీ నేతలంతా జైళ్లలోనే ఉండేవారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రైవేట్ సైన్యం నిర్వహిస్తున్నారనే అనుమానం ఉందని భూమన సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో మద్యం తాగి, బాటిళ్లు పడేసింది వారేనేమో అని ప్రశ్నించారు. 25 గోనె సంచుల నిండా మద్యం బాటిళ్లు బయటపడ్డాయన్న విషయం నిజం కాదా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవేళ వైసీపీ కార్యకర్తే ఈ పని చేశాడని చెబుతున్నట్లయితే, దూరం నుంచి తీసిన సీసీటీవీ ఫుటేజీ కాకుండా, దగ్గరగా ఉన్న కెమెరాల ఫుటేజీని విడుదల చేయాలని సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు.
అరెస్టులు చేసి వైసీపీ గొంతు నొక్కలేరని భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే ఏ అంశమైనా ప్రశ్నిస్తామని, అక్కడ జరుగుతున్న తప్పులు, నేరాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని తేల్చి చెప్పారు.