Pawan Kalyan: సంక్రాంతి అంటే కోడిపందేలే కాదు.. తెలంగాణకు ఆంధ్రా ప్రేమను పంచండి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan Calls for Andhra Telangana Unity During Sankranti
  • పిఠాపురంలో 'పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల'ను ప్రారంభించిన పవన్ 
  • తెలంగాణ సోదరులకు గోదావరి జిల్లాల ఆతిథ్యం రుచి చూపాలని పిలుపు
  • చిన్న విషయాలను వైరల్ చేస్తున్నారని, వ్యవస్థను బలోపేతం చేయడానికే వచ్చానని స్పష్టీకరణ
  • అధికారంతో సంబంధం లేకుండా చివరి శ్వాస వరకు పిఠాపురానికి సేవ చేస్తానని హామీ
తెలంగాణకు ఆంధ్రా ప్రాంత ప్రేమను, ఆతిథ్యాన్ని తీసుకెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మూడు రోజుల పాటు జరగనున్న 'పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల'ను ఆయన ఇవాళ‌ మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆంధ్రా పిండి వంటల స్టాళ్లను వారు పరిశీలించారు.

అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... "సంక్రాంతికి తెలంగాణ సోదరసోదరీమణులను ఆహ్వానించి, వారికి గోదావరి జిల్లాల ఆతిథ్యం రుచి చూపించాలి. పీఠికాపురం సంక్రాంతి ఉత్సవాలకు చిరునామాగా నిలవాలి" అని ఆకాంక్షించారు. సంక్రాంతి అంటే కేవలం కోడిపందేలు, జూదాలు కాదని, సంస్కృతీ సంప్రదాయాల కలయిక అని అన్నారు. సరదాలను కాదనడం లేదని, కానీ పండుగ ఆ ఒక్కదానికే పరిమితం కాకూడదని సూచించారు.

పిఠాపురం అభివృద్ధిపై మాట్లాడుతూ... "ఏదైనా కూలగొట్టడం తేలిక, కానీ నిర్మించడం చాలా కష్టం. ఒక కూటమిని నిర్మించి, అందరినీ ఏకతాటిపై నడపడం అంత సులభం కాదు. నేను వ్యవస్థను బలోపేతం చేయడానికే వచ్చాను" అని అన్నారు. పిఠాపురంలో చిన్న సంఘటన జరిగినా దాన్ని పెద్దది చేసి వైరల్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "పిఠాపురంలో కాకి ఈక పడినా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. పిల్లలు కొట్టుకున్నా కులాలను అంటగడుతున్నారు. కానీ, పులివెందులలో సొంత బాబాయ్‌ని చంపినా అది వార్త కాదు" అని విమర్శించారు.

భగవంతుని సంకల్పంతోనే తాను శక్తిపీఠమైన పిఠాపురంలో పోటీ చేశానని, అధికారంతో సంబంధం లేకుండా తన చివరి శ్వాస వరకు ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తనను బలోపేతం చేస్తే మరింతగా పనిచేసే శక్తి వస్తుందని ఆయన తెలిపారు.
Pawan Kalyan
Pithapuram
Sankranti
Andhra Pradesh
Telangana
AP Deputy CM
Pithapuram Sankranti Mahotsavam
Telugu Festivals
Andhra Culture
Traditions

More Telugu News