అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ సెటైర్లు
- నదీ గర్భంలో రాజధాని కడుతున్నారన్న జగన్
- జగన్ కు ఎంత అవగాహన ఉందో అర్థమవుతోందన్న సత్యకుమార్
- అడ్డదిడ్డంగా వితండవాదం చేస్తున్నారంటూ విమర్శ
ఏపీ రాజధాని అమరాతిని నదీ గర్భంలో కడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ... జగన్ ఏం మాట్లాడారో చూస్తే, ఆయనకు ఎంత అవగాహన ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. కనీస అవగాహన కూడా లేని వ్యక్తిని గతంలో మనం సీఎంగా చేసుకున్నామా అనే సందేహం కలిగేలా ఆయన మాటలు ఉన్నాయని అన్నారు. అడ్డదిడ్డంగా వితండవాదం చేస్తూ... తన అవగాహన రాహిత్యాన్ని ఆయనే బయటపెట్టుకుంటున్నారని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు నాశనం అవుతున్నా అప్పట్లో చూస్తూ కూర్చున్నారని విమర్శించారు. వరద ప్రాంతాలను హైవే మీద నుంచి, రైలు ప్రమాదాన్ని హెలికాప్టర్‌లో నుంచి చూసి వెళ్లిన వ్యక్తి ఇప్పుడు అభివృద్ధి, రాజధాని గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
రాజకీయ లబ్ధి కోసమే జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అంశంలో కూడా డొంక తిరుగుడు మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. అమరావతి నదీ గర్భంలో ఉందని జగన్ చెప్పడం పూర్తిగా అవగాహనలేమికి నిదర్శనమని సత్యకుమార్ యాదవ్ అన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న రాజధానులే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాయనే కనీస అవగాహన కూడా ఆయనకు లేదని విమర్శించారు. వైసీపీ నుంచి నాయకులు వెళ్లిపోకుండా చూసుకునేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.