'జననాయగన్' వివాదానికి తెర.. కోర్టులో నెగ్గిన నిర్మాతలు

  • సినిమాకు 'యూఏ' సర్టిఫికెట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డుకు మద్రాస్ హైకోర్టు ఆదేశం
  • హింస ఎక్కువగా ఉందని, రక్షణ శాఖ చిహ్నాన్ని వాడారని సీబీఎఫ్‌సీ అభ్యంతరాలు
  • సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో సినిమా విడుదలను వాయిదా వేసిన నిర్మాతలు
దళప‌తి విజయ్ న‌టించిన‌ తాజా చిత్రం 'జననాయగన్'కు సంబంధించిన సెన్సార్ వివాదానికి ఇవాళ‌ తెరపడింది. ఈ చిత్రానికి 'యూఏ' సర్టిఫికెట్ జారీ చేయాలని కేంద్ర సెన్సార్ బోర్డును (సీబీఎఫ్‌సీ) మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దీంతో రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించే ముందు విజయ్ నటించిన చివరి చిత్రంగా భావిస్తున్న ఈ సినిమా విడుదలకు కీలకమైన అడ్డంకి తొలగిపోయింది.

నెల రోజుల క్రితం సెన్సార్ కోసం ఉంచినా సర్టిఫికెట్ రాకపోవడంతో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ హైకోర్టును ఆశ్రయించింది. సినిమాలో హింస ఎక్కువగా ఉందని, కొన్ని డైలాగులను మ్యూట్ చేయాలని డిసెంబర్ 19న సెన్సార్ బోర్డు సూచించింది. నిర్మాతలు అందుకు అంగీకరించినా, చివరి నిమిషంలో బోర్డు సభ్యులు మరికొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. కొన్ని స‌న్నివేశాల్లో రక్షణ శాఖకు చెందిన చిహ్నాన్ని వాడారని, దీనిపై నిపుణుల అభిప్రాయం అవసరమని పేర్కొన్నారు. అలాగే మతపరమైన సున్నితమైన అంశాలు ఉన్నాయని కూడా అభ్యంతరం తెలిపారు.

ఈ కారణాలతో సర్టిఫికెట్ జారీలో జాప్యం జరిగింది. దీంతో ఈరోజు విడుద‌ల కావాల్సిన సినిమా విడుదలను అనివార్య కారణాలవల్ల వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత, టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు డ‌బ్బు వాపసు ఇచ్చే ప్రక్రియను థియేటర్ల యాజమాన్యాలు ప్రారంభించాయి.

తాజాగా హైకోర్టు తీర్పుతో చిత్ర బృందానికి పెద్ద ఊరట లభించింది. హెచ్. వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజుస్‌, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి కీల‌క పాత్రలు పోషించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.


More Telugu News