Maa Inti Bangaram: చీరకట్టులో యాక్షన్.. సమంత కొత్త సినిమా టీజర్ చూశారా?

Samantha in Action Maa Inti Bangaram Teaser Released
  • విడుదలైన సమంత ‘మా ఇంటి బంగారం’ టీజర్
  • పూర్తి మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించిన స్టార్ హీరోయిన్
  • ‘ఓ బేబీ’ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రం
  • యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న సినిమాపై భారీ అంచనాలు
  • చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సమంత
కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న స్టార్ హీరోయిన్ సమంత, పూర్తిస్థాయి యాక్షన్ అవతార్‌తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ టీజర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఈ టీజర్‌లో సమంత మునుపెన్నడూ చూడని రగ్డ్, సీరియస్ లుక్‌తో, చీరకట్టులో బస్సులో ఫైట్ చేస్తున్న సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది.

‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ వినడానికి సున్నితమైన కుటుంబ కథా చిత్రంగా అనిపించినా, టీజర్ చూశాక ఇది పక్కా యాక్షన్ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది. సమంత కెరీర్‌లో ఇది ఒక భిన్నమైన ప్రయత్నంగా నిలవనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఓ బేబీ’ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో సమంత చేస్తున్న రెండో సినిమా కావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సమంత సహ నిర్మాతగా వ్యవహరించడం మరో విశేషం.

త్రలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి సమంత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కాంతారా’ ఫేమ్ గుల్షన్ దేవయ్య, కన్నడ నటుడు దిగంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోశ్‌ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, ఆయన నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చనుంది.

ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి వెబ్ సిరీస్‌లలో యాక్షన్ పాత్రలతో మెప్పించిన సమంత, ఈ సినిమాలో డూప్ సహాయం లేకుండా సొంతంగా స్టంట్స్ చేస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘ విరామం తర్వాత పూర్తిస్థాయి కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంతో సమంత వస్తుండటంతో, అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Maa Inti Bangaram
Samantha
Samantha Ruth Prabhu
Nandini Reddy
Action thriller
Gulshan Devaiah
Telugu movie
South Indian cinema
Raj Nidimoru
Himaank Duvvuru

More Telugu News