Chandrababu Naidu: ఏపీ సంస్కృతికి నిదర్శనం 'ఆవకాయ్ – అమరావతి ఫెస్ట్‌వల్': సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Promotes Tourism as Economic Resource in AP
  • తెలుగు జాతి వైభవాన్ని చాటిచెప్పేలా విజయవాడలో ఆవకాయ్ ఉత్సవాల నిర్వహణ
  • రాబోయే పదేళ్లలో పర్యాటక రంగంలో లక్ష గదుల లభ్యతే లక్ష్యం
  • ఏపీ పెట్టుబడులకు కేంద్రమని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక వెల్లడించింది
  • యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యంతో ఏపీ అభివృద్ధికి మరిన్ని అవకాశాలు
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన 'ఆవకాయ్ – అమరావతి ఫెస్ట్‌వల్' కృష్ణా నదీ తీరాన ఘనంగా ప్రారంభమైంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలుగు వారి ఆతిథ్యం, రుచి, క్రియేటివిటీ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటాయని కొనియాడారు.

పర్యాటకమే ఆర్థిక వనరు
పర్యాటక రంగాన్ని అతిపెద్ద ఆర్థిక వనరుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో లక్ష పర్యాటక గదులను అందుబాటులోకి తెస్తామని, సూర్యలంక బీచ్‌ను గోవా తరహాలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం పాపికొండలు, అరకు, గండికోట ఉత్సవాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తామన్నారు. అరకు కాఫీ ఇప్పటికే గ్లోబల్ బ్రాండ్‌గా మారిందని గుర్తు చేశారు.

       

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ
దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే దక్కాయని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక తెలిపిందని చంద్రబాబు పేర్కొన్నారు. పీపీపీ విధానంలో కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టుల్లో 30 శాతం ఏపీలోనే ఉన్నాయని వివరించారు. అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ డైనమిక్ సిటీగా తీర్చిదిద్దుతామని, పర్యాటకులు ఆకర్షితులవ్వాలంటే భద్రత, శుభ్రత కీలకమని ఆయన స్పష్టం చేశారు.

తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు
తెలుగు సినిమా క్రియేటివిటీకి చిరునామా అని, భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు సాధించిన విజయాలే దీనికి నిదర్శమని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ నుంచి ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్, చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బాలయ్య వరకు హీరోలందరూ ఈ ప్రాంతం వారే కావడం గర్వకారణమన్నారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ తమ సొంత ఊళ్లకు వెళ్లి సంప్రదాయాలను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఏపీతో చేతులు కలిపేందుకు ఈయూ సిద్ధం: హెర్వే డెల్ఫీ
యూరోపియన్ యూనియన్ (ఈయూ) రాయబారి హెర్వే డెల్ఫీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా, సాంకేతికంగా వేగంగా వృద్ధి చెందుతోందని ప్రశంసించారు. సెమీ కండక్టర్స్, ఏఐ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. త్వరలో ఏపీలో 'ఈయూ ఫిలిం ఫెస్టివల్' నిర్వహించే అవకాశం ఉందన్నారు. రాజమౌళి తీసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు తానూ చూశానని, 'నాటు నాటు' పాట తనను ఎంతో ఆకర్షించిందని డెల్ఫీ పేర్కొన్నారు.
Chandrababu Naidu
Amaravati Festival
Andhra Pradesh Tourism
AP Investments
European Union
Herve Delphin
Telugu Cinema
AP Culture
Polavaram Project
Sun Ray Lanka Beach

More Telugu News