Supreme Court: వీధి కుక్కలు భయాన్ని పసిగడతాయి... భయపడేవాళ్లపైనే ఎక్కువగా దాడి చేస్తాయి: సుప్రీంకోర్టు

Supreme Court says dogs sense fear attack fearful people
  • వీధి కుక్కల నియంత్రణ కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
  • మనిషి భయాన్ని కుక్కలు పసిగడతాయని, భయపడితే దాడి చేస్తాయని వ్యాఖ్య
  • ఎలుకల నియంత్రణకు కుక్కలు అవసరమన్న స్వచ్ఛంద సంస్థల వాదన
  • కుక్కలకు బదులు పిల్లులను పెంచొచ్చు కదా అని సరదాగా వ్యాఖ్యానించిన ధర్మాసనం
మనిషిలోని భయాన్ని కుక్కలు సులభంగా పసిగట్టగలవని, భయపడే వ్యక్తులపైనే అవి ఎక్కువగా దాడి చేస్తాయని సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల నిర్వహణపై సుమోటోగా స్వీకరించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

పాఠశాలలు, ఆసుత్రులు, బస్టాండ్లు వంటి ప్రజా ప్రాంగణాల్లో పట్టుకున్న వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేశాక తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెట్టవద్దని 2025 నవంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో, "మీరు భయపడుతున్నారని తెలిస్తే కుక్కలు దాడి చేసే అవకాశం ఎక్కువ. ఇది మా వ్యక్తిగత అనుభవం" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ వాదనలు వినిపిస్తూ, ఎలుకల జనాభాను నియంత్రించడంలో కుక్కలు పర్యావరణ సమతుల్యతకు సహాయపడతాయని తెలిపారు. కుక్కలను హఠాత్తుగా తొలగిస్తే ఎలుకల బెడద పెరుగుతుందని, గతంలో సూరత్‌లో ఇలాగే జరిగిందని గుర్తుచేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కుక్కల తొలగింపునకు, ఎలుకల పెరుగుదలకు మధ్య నిర్దిష్ట సంబంధం ఉందా అని ప్రశ్నించింది. సరదాగా వ్యాఖ్యానిస్తూ, "ఎలుకలను పిల్లులు బాగా వేటాడతాయి. కాబట్టి కుక్కలను తగ్గించి, పిల్లులను పెంచితే సమస్య తీరొచ్చు కదా?" అని పేర్కొంది.

పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ వాదిస్తూ, యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) నిబంధనల ప్రకారం పట్టుకున్న కుక్కలను అదే ప్రాంతంలో తిరిగి వదిలిపెట్టాలని తెలిపారు. కుక్కలను షెల్టర్లలో ఎక్కువ కాలం బంధించడం క్రూరత్వం అవుతుందని అన్నారు. ఈ కేసులో కుక్కల ప్రేమికులు, జంతు హక్కుల కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, కుక్కకాటు బాధితులు సహా అన్ని వర్గాల వాదనలను సుప్రీంకోర్టు వింటోంది.
Supreme Court
street dogs
dog attacks
Justice Vikram Nath
animal birth control
ABC rules
PETA
animal rights
dog sterilization
stray dogs

More Telugu News