అశోక్ నగర్‌లో నిరుద్యోగుల అరెస్టు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు

  • నిరుద్యోగుల అరెస్టు అప్రజాస్వామికమన్న కవిత
  • అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని విమర్శ
  • వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, అందుకు అనుగుణంగా నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్
రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలంటూ ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం దారుణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, నిరుద్యోగుల అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించిందని విమర్శించారు.

ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే వారిని అరెస్టు చేయడం దుర్మార్గమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటివరకు 20 వేలకు మించి ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి, దానికి అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని ఆమె కోరారు.

కాగా, అశోక్ నగర్‌లోని సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. వెంటనే జాబ్ క్యాలెండర్‌ను, నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గ్రంథాలయం నుంచి అశోక్ నగర్ చౌరస్తాకు ర్యాలీగా వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


More Telugu News