బంగ్లాదేశ్ విద్యార్థి నేత హాదీ హత్యను భారత్‌తో ముడిపెట్టడంపై స్పందించిన షేక్ హసీనా

  • హాదీ హత్య విషాదకరమని, ఖండించదగిన విషయన్న షేక్ హసీనా
  • యూనస్ ప్రభుత్వంలో హింస పెరుగుతోందని ఆగ్రహం
  • హాదీ హత్యను భారత్‌తో ముడిపెట్టడాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యను భారత్‌తో ముడిపెట్టడాన్ని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హాదీ హత్య విషాదకరమని, ఖండించదగినదని అన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక యూనస్ ప్రభుత్వంలో దేశంలో హింస పెరుగుతుందనడానికి ఇది నిదర్శనమని అన్నారు.

ఉస్మాన్ హాదీ మరణాన్ని ప్రభుత్వం రాజకీయ సాధనంగా ఉపయోగించుకుంటోందని ఆమె ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టడానికి, ప్రజాస్వామ్య సంస్థలపై దాడి చేయించేందుకు తీవ్రవాద గ్రూపులు ఉపయోగించుకుంటున్నాయని అన్నారు. దేశంలో శాంతిభద్రతలను కాపాడటంలో తాత్కాలిక ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉస్మాన్ హాదీ హత్యను భారతదేశంతో ముడిపెట్టడానికి తాత్కాలిక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆమె తప్పుబట్టారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పని అని, భారత్‌పై ఆరోపణలు నిరాధారమని ఆమె అన్నారు. యూనస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విదేశీ కుట్ర అంటూ భారతదేశం వైపు వేలు చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఈ హత్యను భారతదేశంతో ముడిపెట్టే ప్రయత్నాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవే. పూర్తిగా నిరాధారం కూడా. బంగ్లాదేశ్‌కు భారత్ అత్యంత సన్నిహిత మిత్ర దేశం. అలాంటి దేశాన్ని శత్రువుగా చిత్రీకరించే ప్రయత్నాలు తాత్కాలిక ప్రభుత్వం చేస్తోంది" అని షేక్ హసీనా అన్నారు. హాదీ హత్యను భారత్‌తో ముడిపెట్టడం రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహం, పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీయడమే అన్నారు. భారత్‌పై తాత్కాలిక ప్రభుత్వం అభిప్రాయాలు బంగ్లాదేశ్ ప్రజలకు వర్తించవని ఆమె అన్నారు.


More Telugu News