Bipasha Basu: ఫిట్‌నెస్ అంటే సన్నగా అయిపోవడం కాదు: మహిళలకు బిపాషా బసు మెసేజ్
- 47వ పుట్టినరోజు జరుపుకున్న బిపాషా బసు
- శరీరం లోపల నుంచి ఎంత బలంగా ఉందనేదే అసలైన ఫిట్‌నెస్ అన్న బిపాషా
- బరువులు ఎత్తడం మహిళలకు కూడా అవసరం అని సూచన
బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు నిన్న తన 47వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఆమె ఒక విలువైన మెసేజ్ ఇచ్చారు. ఫిట్‌నెస్ అంటే కేవలం డైటింగ్ చేసి సన్నగా అయిపోవడం కాదని, శరీరం లోపలి నుంచి ఎంత బలంగా ఉందనేదే నిజమైన ఫిట్‌నెస్ అని ఆమె స్పష్టం చేశారు.
మన దేశంలో జిమ్ కల్చర్ పెద్దగా లేని రోజుల్లోనే బిపాషా ఫంక్షనల్ ఫిట్‌నెస్ గురించి అందరికీ తెలిసేలా చేశారు. ముఖ్యంగా బరువులు ఎత్తడం (వెయిట్ ట్రెయినింగ్) కేవలం మగవారికి మాత్రమే కాదు, మహిళలకు కూడా చాలా అవసరమని ఆమె గట్టిగా చెబుతున్నారు.
చాలా మంది మహిళలు వెయిట్ ట్రెయినింగ్ చేస్తే మగవారిలా కండలు వచ్చేస్తాయని భయపడతారు. కానీ అది పూర్తి అపోహ అని నిపుణులు చెబుతున్నారు. ఆడవారిలో కండరాలు పెరగడానికి కారణమయ్యే హార్మోన్లు తక్కువగా ఉంటాయి కాబట్టి, బరువులు ఎత్తడం వల్ల శరీరం లావుగా మారదు. బదులుగా అనవసరమైన కొవ్వు కరిగి బాడీ మంచి షేప్‌లోకి వస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనత, వెన్నునొప్పి, ఇంకా ఇతర సమస్యల నుంచి బయటపడాలంటే మహిళలకు వెయిట్ ట్రెయినింగ్ చాలా ముఖ్యం.