ADR Report: పదేళ్లలో రెట్టింపైన ఎంపీల సంపద.. ఏడీఆర్ నివేదికలో సంచలన విషయాలు!

Assets of MPs grow but PM Modi the poorest of them all
  • 2014 నుంచి తిరిగి ఎన్నికైన 102 మంది ఎంపీల సగటు ఆస్తి రెట్టింపు అయిన వైనం
  • పదేళ్లలో సగటు సంపద రూ.15.76 కోట్ల నుంచి రూ.33.13 కోట్లకు పెరిగింద‌న్న‌ ఏడీఆర్ నివేదిక
  • ప్రధాని మోదీ కంటే కేంద్ర మంత్రుల సంపదనే ఎక్కువ‌ని స్పష్టీక‌ర‌ణ‌
  • వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా పలువురి ఆస్తుల్లో భారీ పెరుగుదల నమోదు
  • ఈ జాబితాలో రూ.200 కోట్లకు పైగా ఆస్తులతో నలుగురు ఎంపీలు
రాజకీయ రంగం అత్యంత లాభదాయకమైన వృత్తులలో ఒకటిగా కొనసాగుతోందని మరోసారి స్పష్టమైంది. గత పదేళ్లలో.. అంటే 2014 నుంచి తిరిగి ఎన్నికైన ఎంపీల ఆస్తులు భారీగా పెరిగాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు నిన్న‌ విడుదల చేసిన నివేదిక‌లో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2014 నుంచి తిరిగి ఎన్నికైన 103 మంది ఎంపీలలో 102 మంది సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.

నివేదిక ప్రకారం.. ఈ 102 మంది ఎంపీల సగటు ఆస్తి 2014లో రూ.15.76 కోట్లుగా ఉండగా, 2024 నాటికి అది రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి రూ.33.13 కోట్లకు చేరింది. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన వారిలో ఒకరిగా నిలిచారు. 2014లో ఆయన ఆస్తులు రూ.1 కోటి పైగా ఉండగా, 2024 నాటికి రూ.3.96 కోట్లకు పెరిగాయి.

ప్రధానితో పోలిస్తే పలువురు కేంద్ర మంత్రుల ఆస్తులు ఎక్కువ‌గా ఉన్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (రూ.28 కోట్లు), ప్రహ్లాద్ జోషి (రూ.21 కోట్లు), గజేంద్ర సింగ్ షెకావత్ (రూ.19 కోట్లు), నిత్యానంద్ రాయ్ (రూ.17 కోట్లు), గిరిరాజ్ సింగ్ (రూ.14 కోట్లు), అనురాగ్ సింగ్ ఠాకూర్ (రూ.12 కోట్లు) వంటి వారు మోదీ కంటే ఎక్కువ సంపదను క‌లిగి ఉన్నారు.

రూ.200 కోట్లకు పైగా ఆస్తులతో నలుగురు
ఈ జాబితాలో నలుగురు ఎంపీల ఆస్తులు రూ.200 కోట్లకు పైగా ఉన్నాయి. వీరిలో ముగ్గురు బీజేపీకి చెందినవారే. హేమమాలిని (రూ.278 కోట్లు), ఉదయన్ రాజే భోంస్లే (రూ.223 కోట్లు), మాలా రాజ్యలక్ష్మి షా (రూ.206 కోట్లు) ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శత్రుఘ్న సిన్హా (రూ.210 కోట్లు) కూడా ఈ క్లబ్‌లో చేరారు.

తెలుగు ఎంపీ ఆస్తుల్లోనూ భారీ వృద్ధి
ఆస్తుల వృద్ధిలో పలువురు ఎంపీలు రికార్డు సృష్టించారు. వైసీపీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తులు 2014లో రూ.22 కోట్లుగా ఉండగా, 2024 నాటికి రూ.146 కోట్లకు చేరాయి. అదేవిధంగా బీజేపీ ఎంపీ పూనంబెన్ మాడమ్ ఆస్తులు రూ.17 కోట్ల నుంచి రూ.147 కోట్లకు పెరిగాయి. శివసేన ఎంపీ శ్రీరంగ్ బర్నే ఆస్తులు రూ.66 కోట్ల నుంచి రూ.131 కోట్లకు పెరిగాయి. గుర్గావ్ బీజేపీ ఎంపీ రావ్ ఇంద్రజీత్ సింగ్ ఆస్తులు అత్యధికంగా 385శాతం వృద్ధితో రూ.25 కోట్ల నుంచి రూ.121 కోట్లకు చేరాయి.

ప్రతిపక్ష నేతల్లో హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ (రూ.198 కోట్లు), సుప్రియా సూలే (రూ.166 కోట్లు), శశి థరూర్ (రూ.56 కోట్లు), అసదుద్దీన్ ఒవైసీ (రూ.23 కోట్లు), రాహుల్ గాంధీ (రూ.20 కోట్లు) వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆస్తులు కూడా రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెరిగాయి. ఆసక్తికరంగా ఈ 102 మందిలో కేవలం ఒక్క ఎంపీ ఆస్తులు మాత్రమే తగ్గాయి. బీజేపీ ఎంపీ సి.ఆర్. పాటిల్ ఆస్తులు రూ.74 కోట్ల నుంచి రూ.39 కోట్లకు తగ్గినట్లు ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ADR Report
MPs Assets
Indian Politicians
Narendra Modi
Richest Politicians India
P V Midhun Reddy
Hema Malini
Indian Elections
Politician Net Worth
Association for Democratic Reforms

More Telugu News