Hyderabad: బ్రాండెడ్ సీసాల్లో చీప్ లిక్కర్.. సగం ధరకే ఖరీదైన మద్యం

Adulterated Liquor Racket Exposed by Excise Police in Hyderabad
  • హైదరాబాద్‌లో కల్తీ మద్యం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
  • ఐదుగురు నిందితుల నుంచి రూ. 8 లక్షల విలువైన మద్యం స్వాధీనం
  • ఖరీదైన బాటిళ్లలోని మద్యాన్ని తీసి కల్తీని నింపి విక్రయం
  • వాహన తనిఖీల్లో ఇద్దరు పట్టుబడటంతో వెలుగులోకి వచ్చిన దందా
  • రూ. 20 వేల విలువైన బాటిల్‌ను రూ. 10 వేలకే అమ్ముతున్నట్లు వెల్లడి
ఖరీదైన బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో నుంచి అసలు మద్యాన్ని తీసేసి, దాని స్థానంలో కల్తీ మద్యాన్ని నింపి అమ్ముతున్న ఓ ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ. 8 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 139 కల్తీ మద్యం బాటిళ్లు, 136 ఖాళీ సీసాలు, ఒక స్కూటీ ఉన్నాయి.

వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలోని ఇందిరానగర్ మార్గంలో ఎక్సైజ్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, స్కూటీపై వెళుతున్న దేశిని ప్రకాశ్‌ గౌడ్, గద్వాల భరత్‌లను ఆపారు. వారి వద్ద 15 ఖరీదైన బ్రాండ్ మద్యం బాటిళ్లు లభించాయి. వాటిని పరిశీలించగా, సీసాల్లో కల్తీ మద్యం ఉన్నట్లు తేలింది. వారిని విచారించగా ప్రకాశ్‌ గౌడ్ తమ్ముడైన అరవింద్ ఇంట్లో ఈ దందా నడుస్తున్నట్లు ఒప్పుకున్నారు.

అరవింద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఒడిశాకు చెందిన బుచ్చిదేవ్ మహంతి అనే వ్యక్తి ఈ కల్తీ బాటిళ్లను తయారు చేస్తున్నట్లు తెలిపాడు. వెంటనే మహంతి ఇంటిపై దాడి చేసిన పోలీసులు, అక్కడ 54 మద్యం బాటిళ్లను, ఈ దందాలో భాగస్వామి అయిన విక్రమ్ వద్ద మరో 24 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రూ. 20 వేలు పలికే మద్యం బాటిల్‌ను కల్తీ చేసి రూ. 10 వేలకే విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.

ఈ దాడిలో పాల్గొన్న డీటీఎఫ్ బృందాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణ ప్రియ, డిప్యూటీ కమిషనర్ దశరథ్ అభినందించారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని తదుపరి విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.
Hyderabad
Bucchidev Mahanti
Excise Police
Adulterated liquor
Counterfeit alcohol
Gachibowli
Liquor scam
Telangana
Crime news
Fake liquor

More Telugu News