Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌కు పాక్ గజగజ... సాయం చేయాలంటూ అమెరికా కాళ్లపై పడ్డ వైనం బట్టబయలు!

Operation Sindoor US documents expose Pakistans panic
  • ఆపరేషన్ సిందూర్‌కు భయపడి అమెరికా సాయం కోరిన పాకిస్థాన్
  • భారత్ దాడులు తిరిగి మొదలవుతాయని ఆందోళన చెందిన ఇస్లామాబాద్
  • అమెరికా ఫారా పత్రాల ద్వారా వెలుగులోకి వచ్చిన నిజాలు
  • ప్రధాని మోదీ హెచ్చరికలతో పాకిస్థాన్‌లో తీవ్ర ఆందోళన
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌'కు పాకిస్థాన్ ఎంతగా భయపడిపోయిందో తాజాగా వెలుగులోకి వచ్చిన అమెరికా ప్రభుత్వ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. భారత సైనిక చర్య కేవలం 'తాత్కాలికంగా ఆగిందని', ఎప్పుడైనా మళ్లీ మొదలుకావచ్చని తీవ్ర ఆందోళన చెందిన పాకిస్థాన్, సాయం చేయాలంటూ అమెరికాను ఆశ్రయించింది. కాల్పుల విరమణ కోసం భారతే తమను వేడుకుందని ఇన్నాళ్లూ పాకిస్థాన్ చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని ఈ పత్రాలు తేటతెల్లం చేశాయి.

అమెరికాకు చెందిన ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (FARA) కింద పాకిస్థాన్ తరఫున పనిచేస్తున్న స్క్వేర్ పాటన్ బాగ్స్ అనే లాబీయింగ్ సంస్థ దాఖలు చేసిన పత్రాలను ఎన్డీటీవీ సంపాదించింది. "ప్రధాని మోదీ తమ సైనిక చర్యను కేవలం నిలిపివేశామని, పాకిస్థాన్‌పై దాడులు తిరిగి ప్రారంభం కావచ్చని చెప్పడం మాకు ఆందోళన కలిగిస్తోంది" అని ఆ పత్రాల్లో పాక్ తరఫు లాబీయింగ్ సంస్థ స్పష్టంగా పేర్కొంది. ఇది పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్‌లో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది.

2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను, ముఖ్యంగా పర్యాటకులను ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్ 2025 మే 7న 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించింది. పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. కేవలం నాలుగు రోజుల పాటు సాగిన ఈ భీకర పోరు తర్వాత మే 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.

అయితే, కాల్పుల విరమణ కోసం పాకిస్థాన్ సైనిక కమాండర్లే అభ్యర్థించారని, భారత దాడుల తీవ్రతకు తట్టుకోలేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవాలని వారు కోరినట్లు ఈ పత్రాలు ధ్రువీకరిస్తున్నాయి. మరోవైపు, భారత్ మాత్రం అమెరికా మధ్యవర్తిత్వాన్ని కోరలేదని, కాల్పుల విరమణ గురించి చర్చించలేదని కూడా ఈ ఫైలింగ్స్ స్పష్టం చేశాయి.

ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడుతూ, "ఆపరేషన్ సిందూర్ ను  కేవలం తాత్కాలికంగా నిలిపివేశాం. పాకిస్థాన్ మళ్లీ దుస్సాహసానికి పాల్పడితే తగిన రీతిలో, మరింత తీవ్రంగా బదులిస్తాం" అని గట్టిగా హెచ్చరించారు. ఈ తాజా పరిణామాలు అంతర్జాతీయంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ, తెరవెనుక మాత్రం తమ బలహీనతను అంగీకరించిన పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని మరోసారి బట్టబయలు చేశాయి. 
Operation Sindoor
Pakistan
India
United States
Narendra Modi
Donald Trump
Terrorist camps
Ceasefire
Pahalgam attack
FARA

More Telugu News