Secretariat Employee: ఇది మీరిచ్చిన జీవితం.. ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను: సీఎం చంద్రబాబుకు ఉద్యోగి కృతజ్ఞతలు

Chandrababu Given Me Life Employee Expresses Gratitude
  • సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన సచివాలయ ఉద్యోగి
  • మీరిచ్చిన జీవితమిది అంటూ శంకర్రావు భావోద్వేగం
  • 1996లో మీ వల్లే ఉద్యోగం వచ్చిందని వెల్లడి
  • ఇంటి స్థలం, గృహ నిర్మాణం కూడా మీ హయాంలోనేనని వివరణ
  • ఉద్యోగిని ఆప్యాయంగా పలకరించి భరోసా ఇచ్చిన సీఎం
‘ఇది మీరిచ్చిన జీవితం. ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను’ అంటూ సచివాలయ ఉద్యోగి ఒకరు సీఎం చంద్రబాబు ఎదుట భావోద్వేగానికి గురయ్యారు. సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శంకర్రావు, తన జీవితం బాగుపడటానికి చంద్రబాబే కారణమని చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన పలువురిని కదిలించింది.

సచివాలయ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఇటీవల సీఎం చంద్రబాబును కలిసింది. ఈ బృందంతో పాటే సెక్షన్ ఆఫీసర్ శంకర్రావు కూడా ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లారు. చంద్రబాబును వ్యక్తిగతంగా కలవాలన్న తన చిరకాల కోరికను సంఘం అధ్యక్షుడు రామకృష్ణ సాయంతో ఆయన నెరవేర్చుకున్నారు.

మీ వల్లే ఉద్యోగం, ఇల్లు..
సీఎంను కలిసిన సందర్భంగా శంకర్రావు తన జీవితంలోని కీలక ఘట్టాలను గుర్తుచేసుకున్నారు. 1996లో చంద్రబాబు తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారానే తాను టైపిస్టుగా ఉద్యోగంలో చేరానని చెప్పారు. అప్పటి వరకు నిరుద్యోగంతో నిస్పృహలో ఉన్న తన జీవితానికి ఆ ఉద్యోగమే దారి చూపిందన్నారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హయాంలోనే ఇంటి స్థలం వచ్చిందని, 2014-19 మధ్య కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హౌస్ బిల్డింగ్ అలవెన్స్‌తో హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నానని వివరించారు.

'మీరు సంతోషంగా ఉన్నారు కదా?'.. ఉద్యోగిని ఆప్యాయంగా పలకరించిన సీఎం
శంకర్రావు చెప్పినదంతా ఓపికగా విన్న చంద్రబాబు.. ‘మీరు సంతోషంగా ఉన్నారు కదా?’ అంటూ ఆయనను ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో రిటైర్ కాబోతున్నానని శంకర్రావు చెప్పడంతో.. పదవీ విరమణ తర్వాత ఏ అవసరం వచ్చినా తనను వచ్చి కలవాలని సీఎం భరోసా ఇచ్చారు.
Secretariat Employee
Chandrababu
Shankarrao
Andhra Pradesh
Government Job
House Building Allowance
Gratitude
Section Officer
Ramakrishna

More Telugu News