Prithviraj Chavan: మోదీని ట్రంప్ కిడ్నాప్ చేస్తారా అన్న కాంగ్రెస్ నేత.. బీజేపీ స్పందన
- వెనిజువెలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన అమెరికా
- మన దేశంలో కూడా ఇలాగే జరిగితే పరిస్థితి ఏమిటన్న చవాన్
- దేశ ప్రతిష్టను అవమానించడమే అంటూ బీజేపీ మండిపాటు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా ఆర్మీ ఆపరేషన్‌లో పట్టుకుని తీసుకెళ్లిన సంగతి అందరికీ తెలుసు. డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఉన్న మదురోను ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ బలగాలు బంధించాయి. దీన్ని ఉదాహరణగా తీసుకుని చవాన్ మాట్లాడుతూ... వెనిజువెలాలో జరిగినట్టు భారత్‌లోనూ జరిగితే? పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ట్రంప్ మన ప్రధాని మోదీని కూడా కిడ్నాప్ చేస్తారా? అని అడిగారు. అమెరికా తన ప్రయోజనాల కోసం ఏ దేశ నాయకుడినైనా లక్ష్యం చేసుకోవచ్చని, అది మన దేశ స్వాతంత్ర్యానికి ప్రమాదమని చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇది ప్రధాని మోదీని కించపరచడమే కాదు, భారత్ ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రతిష్టను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఒక బలమైన రాజ్యమని, వెనిజువెలా వంటి చిన్న దేశంతో పోల్చడం మూర్ఖత్వమని అన్నారు.
మరోవైపు, కాంగ్రెస్ వర్గాలు మాత్రం చవాన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నాయి. అమెరికా దూకుడు విధానాన్ని మాత్రమే చవాన్ హెచ్చరిస్తున్నారని, ప్రధానిని ఉద్దేశపూర్వకంగా అనలేదని. ట్రంప్-మోదీ మధ్య మంచి స్నేహం ఉన్నా, ఇలాంటి వ్యాఖ్యలు రెండు దేశాల దౌత్య సంబంధాలకు ఇబ్బంది కలిగించవచ్చని నిపుణులు అంటున్నారు.