Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. ప్రాణాలు కాపాడుకోబోయి కాలువలోకి దూకి హిందూ యువకుడి మృతి

Hindu man dies after jumping in canal while escaping mob in Bangladesh
  • బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడిపై దొంగతనం నెపంతో మూక దాడి
  • ప్రాణభయంతో కాలువలోకి దూకిన బాధితుడు.. నీటిలో మునిగి మృతి
  • గత 19 రోజుల్లో హిందువులపై జరిగిన దాడుల్లో ఇది ఏడో ఘటన
  • మహ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చాక పెరిగిన హింసాత్మక ఘటనలు
  • మైనారిటీలపై వరుస దాడులతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
బంగ్లాదేశ్‌లో మైనారిటీలే లక్ష్యంగా హింసాత్మక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దొంగతనం ఆరోపణలతో ఓ అల్లరి మూక వెంటపడటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కాలువలోకి దూకిన ఓ హిందూ యువకుడు మృతి చెందాడు. నౌగావ్ జిల్లాలోని మహాదేవ్‌పూర్ ఉపజిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం చాక్‌గోరి ప్రాంతానికి చెందిన మిథున్ సర్కార్ (25) అనే యువకుడిపై కొందరు దొంగతనం నెపం మోపి వెంబడించారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మిథున్ సమీపంలోని లోతైన కాలువలోకి దూకాడు. అయితే, నీటి ప్రవాహం బలంగా ఉండటంతో అందులో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల తర్వాత మిథున్ మృతదేహాన్ని వెలికితీశారు.

ఈ ఘటనపై మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ షాహిదుల్ ఇస్లాం స్పందించారు. "దొంగతనం అనుమానంతో కొందరు వెంబడించడంతో ఆ యువకుడు కాలువలోకి దూకినట్లు ప్రాథమికంగా తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించాం. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని ఆయన వివరించారు.

గత 19 రోజుల్లో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడుల్లో ఇది ఏడో ఘటన కావడం గమనార్హం. ఈ వారంలోనే ఇది మూడోది. సోమవారం నర్సింగ్డి జిల్లాలో శరత్ చక్రవర్తి అనే వ్యక్తిని, జషోర్ జిల్లాలో రాణా ప్రతాప్ బైరాగి అనే వ్యాపారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతకుముందు డిసెంబర్‌లో దైవదూషణ ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే యువకుడిని ఓ మూక కొట్టి చంపి, చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Bangladesh
Mithun Sarkar
Hindu youth
Minority attack
Nagaon district
Mahadevpur
Theft Accusation
Religious violence
Human rights
Communal violence

More Telugu News