Stray dogs: వీధి కుక్కల కేసు విచారణలో సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court Remarks on Unpredictable Nature of Street Dogs
  • కుక్క ఏ మూడ్ లో ఉందో ఎవరూ ఊహించలేరన్న సుప్రీం ధర్మాసనం
  • కరిచినా, కరవకున్నా కుక్కల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వ్యాఖ్య
  • వీధుల్లో, స్కూల్స్, విద్యా సంస్థల పరిసరాల్లో కుక్కలు ఉండాల్సిన అవసరమేంటని ప్రశ్న
వీధి కుక్కలు ఎప్పుడు కరుస్తాయనే విషయం ఎవరూ ఊహించలేరని, వాటి మూడ్ ను అర్థం చేసుకోలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీధుల్లో సంచరించే కుక్కలు తరచూ వాహనాలకు అడ్డుపడి ప్రమాదాలకు కారణమవుతున్నాయని గుర్తుచేసింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్ హోంలకు తరలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం ఈ రోజు విచారించింది.

ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. వీధుల్లో తిరిగే కుక్క కరుస్తుందని భావించినపుడు స్థానికులు అధికారులకు సమాచారం అందించాలని చెప్పారు. అధికారులు ఆ శునకాన్ని తీసుకువెళ్లి స్టెరిలైజ్ చేసి వదిలిపెడతారని అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. స్టెరిలైజ్ చేశాక మనుషులను కరవకుండా వాటికి కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పడం మర్చిపోయినట్టున్నారని వ్యాఖ్యానించింది. మనుషులను కరవడం మాత్రమే కాదు.. వీధుల్లో కుక్కలు పరిగెత్తడం వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని ధర్మాసనం గుర్తు చేసింది.

ప్రమాదం జరిగాక చికిత్స తీసుకోవడం కన్నా ముందే జాగ్రత్త పడడం మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. వీధుల్లో, స్కూళ్లు, విద్యాసంస్థల చుట్టుపక్కల కుక్కలు సంచరించాల్సిన అవసరం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. వీధుల్లో సంచరించే ప్రతీ కుక్క మనుషులను కరవకపోవచ్చు కానీ రోడ్లపై అవి అడ్డదిడ్డంగా పరుగులు పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం మాత్రం ఉందని ధర్మాసనం పేర్కొంది.
Stray dogs
Supreme Court
dog bites
animal control
Delhi
Kapil Sibal
sterilization
road accidents
animal shelters

More Telugu News