Shivaji Maharaj: ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. 20 ఏళ్ల తర్వాత క్షమాపణ చెప్పిన ఆక్స్‌ఫర్డ్ ప్రెస్

Shivaji Maharaj Oxford Press Apologizes for Controversial Remarks After 20 Years
  • ఛత్రపతి శివాజీ వారసుడికి క్షమాపణ చెప్పిన ఆక్స్‌ఫర్డ్ ప్రెస్
  • 20 ఏళ్ల క్రితం ప్రచురితమైన పుస్తకంలోని వ్యాఖ్యలపై వివాదం
  • పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలు నిర్ధారించుకోనివి అని అంగీకారం
  • ప్రజలకు కలిగిన ఆవేదనకు చింతిస్తున్నామని ప్రకటన
ఛత్రపతి శివాజీ మహారాజ్ 13వ తరం వారసుడైన ఉదయన్‌రాజే భోంస్లేకు ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (OUP) క్షమాపణలు తెలియజేసింది. రెండు దశాబ్దాల క్రితం తాము ప్రచురించిన ఓ పుస్తకంలో శివాజీ గురించి నిర్ధారించుకోని వ్యాఖ్యలు ఉన్నాయని అంగీకరించింది. ఈ మేరకు ఓ పత్రికలో బహిరంగ ప్రకటన జారీ చేసింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
అమెరికన్ రచయిత జేమ్స్ లైన్ రాసిన 'శివాజీ: హిందూ కింగ్ ఇన్ ఇస్లామిక్ ఇండియా' అనే పుస్తకాన్ని 2003లో ఓయూపీ ప్రచురించింది. ఈ పుస్తకంలోని 31, 33, 34, 93 పేజీలలో ఉన్న కొన్ని వ్యాఖ్యలు అవాస్తవాలని, వాటిని నిర్ధారించుకోలేదని ఓయూపీ ఇండియా తమ ప్రకటనలో అంగీకరించింది. ఈ వ్యాఖ్యల ప్రచురణ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని, దీనివల్ల ఉదయన్‌రాజే భోంస్లేతో పాటు ప్రజలకు కలిగిన బాధకు, ఆవేదనకు క్షమాపణ కోరుతున్నామని పేర్కొంది. ఓయూపీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ సయీద్ మంజార్ ఖాన్ తరఫున ఈ క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది.

కాగా, ఈ పుస్తకం విడుదలైన సమయంలో పెను వివాదం చెలరేగింది. శివాజీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, రచయితకు పుణెలోని ప్రఖ్యాత భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (BORI) సహాయం చేసిందని ఆరోపిస్తూ.. 2004 జనవరిలో సంభాజీ బ్రిగేడ్‌కు చెందిన సుమారు 150 మంది కార్యకర్తలు ఆ సంస్థపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత ఆక్స్‌ఫర్డ్ ప్రెస్ నుంచి క్షమాపణ రావడం గమనార్హం.
Shivaji Maharaj
Udayanraje Bhonsle
Oxford University Press
James Laine
Shivaji Hindu King in Islamic India
BORI
Sambhaji Brigade
controversial remarks
apology
Indian history

More Telugu News