Bangladesh: పాకిస్థాన్ నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్న బంగ్లాదేశ్!

Bangladesh to Buy Warplanes from Pakistan
  • బంగ్లాదేశ్‌కు యుద్ధ విమానాల విక్రయంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయన్న ఐఎస్‌పీఆర్ 
  • పాకిస్థాన్ నుంచి జెఎఫ్ -17 థండర్ ఫైటర్ జెట్ల కొనుగోలు చేయనున్న బంగ్లాదేశ్
  • జెఎఫ్ - 17 థండర్ యుద్ధ విమానాలను చైనా - పాకిస్థాన్ కలిసి తయారు చేస్తున్న వైనం
దక్షిణాసియాలో వ్యూహాత్మక పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్థాన్ల మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం తొలగిన అనంతరం, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు దూరంగా, పాకిస్థాన్‌కు దగ్గరయ్యే విధంగా అడుగులు వేస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ నుంచి యుద్ధ విమానాలను (జెఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్లు) బంగ్లాదేశ్ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.

ఈ విషయాన్ని పాకిస్థాన్ సైన్యానికి చెందిన ప్రచార విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) అధికారికంగా వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు యుద్ధ విమానాల విక్రయంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినట్లు తెలిపింది. జెఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలను చైనా, పాకిస్థాన్ సంయుక్తంగా తయారు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల బంగ్లాదేశ్ ఎయిర్ చీఫ్ మార్షల్ హసన్ మహమూద్ ఖాన్ ఇస్లామాబాద్‌లో పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూతో సమావేశమయ్యారని పాక్ సైన్యం వెల్లడించింది. ఈ సమావేశంలో ఆపరేషనల్ కోఆపరేషన్, సంస్థాగత సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించినట్లు వెల్లడించింది. శిక్షణ, సామర్థ్య నిర్మాణం రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలిపింది.

ఇదే సమయంలో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌కు శిక్షణ అందించేందుకు పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ ముందుకు వచ్చినట్లు ఐఎస్‌పీఆర్ పేర్కొంది. 
Bangladesh
Bangladesh Pakistan relations
JF-17 Thunder
Pakistan warplanes
Sheikh Hasina
Hasan Mahmud Khan
Zahir Ahmad Babar Sidhu
Bangladesh air force

More Telugu News