Greater Noida: భర్తకు బట్టతల.. జుట్టుందని చెప్పి మోసం చేశారంటూ పోలీసుల‌కు భార్య ఫిర్యాదు!

Woman Files Police Complaint Against Husband Over Baldness and Dowry
  • భర్తకు బట్టతల, విగ్గు పెట్టుకుంటాడనే విషయం పెళ్లికి ముందు దాచారని ఆరోపణ
  • విద్యార్హతలు, ఆర్థిక విషయాల్లోనూ మోసం చేశారని భార్య ఫిర్యాదు
  • ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ శారీరకంగా హింసించాడని ఆరోపణ
  • థాయ్‌లాండ్ నుంచి డ్రగ్స్ తీసుకురమ్మని ఒత్తిడి చేశాడని వెల్లడి
  • భర్త, అత్తింటివారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
పెళ్లికి ముందు చెప్పినదానికి, పెళ్లయ్యాక చూసినదానికి సంబంధం లేదంటూ ఓ మహిళ తన భర్త, అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తకు ఒత్తైన జుట్టు ఉందని చెప్పి, బట్టతల విషయాన్ని దాచిపెట్టి మోసం చేశారని ఆరోపించింది. ఈ వింత ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.

పీటీఐ కథనం ప్రకారం గౌర్ సిటీ అవెన్యూ-1లో నివసించే లవికా గుప్తాకు, సన్యం జైన్‌తో 2024 జనవరి 16న వివాహం జరిగింది. పెళ్లికి ముందు సన్యం జైన్‌కు ఒత్తైన జుట్టు ఉన్నట్లు తనకు చెప్పారని, కానీ పెళ్లయ్యాక అతడికి బట్టతల ఉందని, హెయిర్ ప్యాచ్ (విగ్గు) పెట్టుకుంటాడని తెలిసిందని లవిక తన ఫిర్యాదులో పేర్కొంది. కేవలం రూపం విషయంలోనే కాకుండా విద్యార్హతలు, ఆర్థిక స్థితిగతుల గురించి కూడా అబద్ధాలు చెప్పి తనను మోసం చేశారని ఆమె ఆరోపించింది.

పెళ్లయిన కొన్నాళ్లకే భర్త తనను శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడని, ప్రైవేట్ ఫొటోలు బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడని లవిక తెలిపింది. అంతేకాకుండా విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు తనపై దాడి చేసి, థాయ్‌లాండ్ నుంచి గంజాయి తీసుకురావాలని తీవ్ర ఒత్తిడి చేశాడని ఆమె తన ఫిర్యాదులో వివరించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు బిస్రఖ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్త సన్యం జైన్‌తో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులపై బీఎన్ఎస్‌ కింద వివిధ సెక్షన్లతో పాటు వరకట్న నిషేధ చట్టం కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి మనోజ్ కుమార్ సింగ్ వెల్లడించారు.
Greater Noida
Lavika Gupta
hair patch
fraud marriage
domestic violence
dowry harassment
Sanyam Jain
Bisrakh Police Station
false representation
Thailand drug

More Telugu News