విద్యాసంస్థ అధినేత కీచకపర్వం: పదో తరగతి విద్యార్థినిపై అఘాయిత్యం

  • జగద్గిరిగుట్టలోని 'నిస్సీ స్వాతి' స్కూల్‌లో దారుణం
  • అదనపు తరగతుల పేరిట గదికి పిలిపించుకుని ప్రధానోపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
  • నిందితుడు విజయ్‌కుమార్‌కు దేహశుద్ధి చేసిన విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన విద్యాసంస్థ అధినేతే కీచకుడిగా మారిన ఘటన హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రైవేట్ పాఠశాల యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చంద్రగిరినగర్‌లోని 'నిస్సీ స్వాతి' ప్రైవేట్ పాఠశాల నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్, అదనపు తరగతుల సాకుతో ఓ విద్యార్థినిని పాఠశాల భవనంపైనే ఉన్న తన నివాసానికి పిలిపించుకునేవాడు. అక్కడ సదరు బాలికతో ఇంటి పనులు చేయించుకోవడమే కాకుండా, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. కొన్ని రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా, ప్రధానోపాధ్యాయుడి అకృత్యం వెలుగులోకి వచ్చింది.

విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులతో పాటు విద్యార్థి సంఘాల నేతలు మంగళవారం పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఘటనపై విజయ్‌కుమార్‌ను నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆందోళనకారులు అతడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందిన వెంటనే సీఐ వెంకటేశం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. దీనిపై స్థానిక ఎంఈవో జెమినీ కుమారి స్పందిస్తూ.. ఈ ఉదంతాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


More Telugu News