Telangana: డిజిటల్ జోరులో తెలంగాణ.. ల్యాప్‌టాప్‌ల వినియోగంలో దేశంలోనే టాప్!

Telangana tops in laptop usage in India digital surge
  • పట్టణ గృహాల్లో ల్యాప్‌టాప్‌ల వినియోగంలో దేశంలోనే మొదటి స్థానం
  • డ్యూరబుల్ గూడ్స్ కొనుగోలులో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానం
  • మొబైల్ ఫోన్ల విప్లవంతో తగ్గుతున్న టీవీ ప్రాధాన్యత
  • మూతపడే దిశలో కొన్ని వినోద ఛానళ్లు
  • ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి నివేదికలో ఆసక్తికర అంశాల వెల్లడి
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని గృహాల్లో అత్యధికంగా ల్యాప్‌టాప్‌లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. గత పదేళ్లలో 10 శాతంగా ఉన్న ల్యాప్‌టాప్‌ల వినియోగం ప్రస్తుతం 19 శాతానికి చేరుకుంది. ఐటీ విస్తరణ, డిజిటల్ వర్క్ కల్చర్, విద్యా అవసరాలే ఈ వృద్ధికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ‘చేంజెస్‌ ఇన్‌ డ్యూరబుల్‌ గూడ్స్‌ ఓనర్షిప్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో తాజా నివేదికను విడుదల చేసింది.

ఖర్చులోనూ మనమే మేటి
దీర్ఘకాలిక వినియోగ వస్తువుల (డ్యూరబుల్ గూడ్స్)పై ఖర్చు చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో సగటు వ్యక్తి ఖర్చు రూ. 1,191 ఉండగా, తెలంగాణలో రూ. 1,022గా నమోదైంది. రాష్ట్రంలోని పట్టణాల్లో 63 శాతం మందికి సొంత వాహనాలు ఉండగా, 58 శాతం ఇళ్లలో ఫ్రిజ్‌లు, 45 శాతం ఇళ్లలో ఎయిర్ కూలర్లు ఉన్నాయి. అయితే వాషింగ్ మెషీన్ల వినియోగం మాత్రం 33 శాతానికే పరిమితం కావడం గమనార్హం.

కర్ణాటకను మించిన వృద్ధి
టెక్ హబ్‌గా పేరున్న కర్ణాటకలో ల్యాప్‌టాప్ వినియోగ వృద్ధి 2 నుంచి 3 శాతానికే పరిమితం కాగా, తెలంగాణలో ఇది ఏకంగా 9 శాతం పెరగడం విశేషం. ఇది రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు, ఉత్పాదకత మెరుగుదలకు నిదర్శనమని నివేదిక పేర్కొంది. కాగా, మొబైల్ ఫోన్ల వినియోగం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్వయించుకుని నిత్యావసరంగా మారింది.

తగ్గుతున్న టీవీల ప్రభ
మొబైల్ డేటా చౌకగా లభించడం, ఓటీటీల హవా పెరగడంతో టీవీల ప్రాధాన్యం క్రమంగా తగ్గుతోంది. తెలంగాణలోని పట్టణాల్లో 80 శాతం, గ్రామాల్లో 60 శాతం మందికి టీవీలు ఉన్నప్పటికీ, వినోదం కోసం మొబైల్ ఫోన్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. యాడ్స్ గోల లేకపోవడం, నచ్చిన సమయంలో నచ్చిన కంటెంట్ చూసే వీలుండటంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు మొబైల్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మార్పుల వల్ల నిర్వహణ భారం పెరిగి కొన్ని వినోద ఛానళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Telangana
Telangana laptops
laptop usage India
digital Telangana
durable goods Telangana
PM Economic Advisory Council
digital work culture
mobile phone usage
OTT platforms
consumer spending

More Telugu News