ONGC: కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఅవుట్... ఇంకా అదుపులోకి రాని మంటలు

ONGC Gas Blowout in Konaseema Fires Still Raging
  • కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్‌జీసీ బావి బ్లోఅవుట్
  • రెండో రోజూ అదుపులోకి రాని మంటలు
  • భద్రతా చర్యల్లో భాగంగా 500 కుటుంబాల తరలింపు
  • సీఎం, డిప్యూటీ సీఎం పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపిన ఎంపీ
కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్‌జీసీ బావిలో చెలరేగిన మంటలు రెండో రోజు కూడా అదుపులోకి రాలేదు. సోమవారం మధ్యాహ్నం మోరి-5 బావిలో రిపేర్ పనులు చేస్తుండగా అధిక పీడనంతో గ్యాస్, ముడి చమురు బయటకు చిమ్మి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనతో సమీప గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.

ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతర్జాతీయ నిపుణుల సహాయం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని, బావిని చల్లబరిచే పనులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి నీరు, మట్టితో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు రెండు లారీల్లో కూలెంట్ ను తీసుకువస్తున్నారు. దీని సాయంతో మంటలు ఆర్పడంలో పురోగతి కనిపిస్తుందని భావిస్తున్నారు.

కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఇరుసుమండ, మోరి గ్రామాలకు చెందిన సుమారు 500 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి భోజనం, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అమలాపురం ఎంపీ గంటి హరీశ్ బాలయోగి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.
ONGC
Konaseema gas blowout
Andhra Pradesh
Malikipuram
Irusumanda village
Ganti Harish Balayogi
Chandrababu Naidu
Pawan Kalyan
Fire accident
Oil and Gas

More Telugu News