Falcon Scam: ఫాల్కన్ స్కామ్‌లో కీలక పరిణామం.. ముంబైలో ఎండీ అమర్ దీప్ అరెస్ట్

Falcon Scam MD Amar Deep Arrested in Mumbai
  • డిజిటల్ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు
  • స్కామ్ బయటపడగానే దుబాయ్‌కు పారిపోయిన అమర్ దీప్
  • గల్ఫ్ నుంచి రాగానే ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో అరెస్ట్
వందల కోట్ల రూపాయల ఫాల్కన్ స్కామ్ కేసులో తెలంగాణ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఫాల్కన్ సంస్థ ఎండీ అమర్ దీప్‌ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో సుమారు రూ.850 కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమర్ దీప్, గల్ఫ్ నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే పోలీసులు అరెస్ట్ చేశారు. 

అమర్ దీప్‌పై ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్ (LOC) జారీ కావడంతో ఆయ‌న‌ ముంబై వచ్చిన విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలంగాణ పోలీసులకు తెలియజేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అమర్ దీప్‌ను అరెస్ట్ చేశారు. గతంలో ఈ స్కామ్ వెలుగులోకి రాగానే ఆయ‌న‌ తన భార్యతో కలిసి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో దుబాయ్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

యాప్ ఆధారిత డిజిటల్ డిపాజిట్లు, మల్టీ నేషనల్ కంపెనీలు, షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో అమర్ దీప్ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి ప్రజలను మోసగించినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే ఫాల్కన్ సంస్థ సీఈఓతో పాటు అమర్ దీప్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెలల తరబడి గాలింపు చర్యల అనంతరం ప్రధాన నిందితుడు అమర్ దీప్ దొరకడంతో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది.
Falcon Scam
Amar Deep
Telangana Police
Mumbai Arrest
Digital Deposits Scam
Lookout Circular
Fraud Case
Economic Offense
Cyber Crime
Investment Fraud

More Telugu News