Mukesh Patel: ఆస్తి కోసం తండ్రి, సోదరి, ఆమె మైనర్ కుమార్తెను చంపి బావిలో పడేసిన కిరాతకుడు

Mukesh Patel Arrested for Killing Father Sister Niece Over Property
  • తమ్ముడి పేరున ఆస్తి రాశారన్న కోపం
  • తండ్రి, సోదరి, మేనకోడలిని అంతం చేసిన పెద్ద కుమారుడు
  • మూడు రోజుల గాలింపు తర్వాత బావిలో కుళ్లిన స్థితిలో మృతదేహాల గుర్తింపు
  • తమ్ముడిపై కూడా కాల్పులు.. ప్రాణాలతో బయటపడిన యువకుడు 
  • ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సమీపంలో వెలుగుచూసిన దారుణం
ఆస్తి తగాదాలు మానవ సంబంధాలను ఎంతెలా దిగజారుస్తాయో చెప్పే మరో దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తన పేరున ఆస్తి రాయలేదన్న కక్షతో తండ్రిని, అడ్డువచ్చిన సోదరిని, మైనర్ మేనకోడలిని హత్య చేసి, మృతదేహాలను బావిలో పడేసిన నిందితుడు ముఖేశ్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. లోకాపూర్ గ్రామానికి చెందిన రామసింగ్ (60) తనకున్న ఆస్తిని చిన్న కుమారుడు ముకుంద్ లాల్ పేరున రాశారు. దీనిపై పెద్ద కుమారుడు ముఖేశ్ పటేల్ కొంతకాలంగా తండ్రితో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి ముఖేశ్ తన తండ్రి ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. తొలుత తండ్రి రామసింగ్‌ను గొంతు నులిమి చంపిన నిందితుడు, ఆపై అడ్డువచ్చిన సోదరి సాధన (24), మేనకోడలు ఆస్థ (14)లను గొడ్డలితో నరికి కిరాతకంగా చంపాడు. ఆధారాలను మాయం చేసేందుకు మూడు మృతదేహాలను ఇంటి సమీపంలోని పాడుబడిన బావిలో వేసి పైన ఎండుగడ్డితో కప్పేశాడు.

మరుసటి రోజు శనివారం, తన తమ్ముడు ముకుంద్‌ను కూడా అంతం చేయాలని భావించిన ముఖేశ్, అతడిపై కాల్పులు జరిపాడు. అయితే ఈ దాడి నుంచి ముకుంద్ గాయాలతో బయటపడ్డాడు. తన తండ్రి, సోదరి కనిపించడం లేదని ముకుంద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తమ్ముడిపై దాడి కేసులో ముఖేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా, ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది. నిందితుడు చూపిన గుర్తుల ఆధారంగా బావి నుంచి పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలిని, తమ్ముడిపై కాల్పులు జరిపిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు జైల్లో ఉండగా, గాయపడిన తమ్ముడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Mukesh Patel
Uttar Pradesh
property dispute
triple murder
crime
Lokapur
Ram Singh
minor girl
murder arrest

More Telugu News