Chandrababu Naidu: జల వివాదాలను సామరస్యంతో పరిష్కరించుకుందాం: ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu calls for amicable resolution of water disputes
  • తెలుగు రాష్ట్రాల మధ్య సహకారం అవసరమన్న చంద్రబాబు
  • కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేసి తీరతామని స్పష్టీకరణ
  • తెలంగాణ సుప్రీంకోర్టుకు వెళ్లిన వేళ సీఎం కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల పంపకాల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహకారం అవసరమని, ఐక్యంగా ఉంటేనే దేశంలో అగ్రస్థానానికి చేరుకోగలమని ఆయన అన్నారు. సోమవారం గుంటూరులో జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ప్రసంగించారు. పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రతి ఏటా 3,000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయని, గతేడాది కృష్ణా, గోదావరి నుంచి ఏకంగా 6,282 టీఎంసీల నీరు సముద్రంపాలైందని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని నదులన్నింటినీ అనుసంధానం చేయాల్సిందేనని, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

గోదావరిలో పుష్కలంగా ఉన్న నీటిని తెలంగాణ వినియోగించుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని అన్నారు. తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని, రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు అనేక ప్రాజెక్టులు చేపట్టి సాగునీటి వ్యవస్థకు బాటలు వేశారని చంద్రబాబు కొనియాడారు. నాగార్జున సాగర్ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు ఎన్టీఆర్ ఎస్ఎల్‌బీసీ, ఎస్ఆర్‌బీసీ కాలువలు నిర్మించారని గుర్తుచేశారు. ఆ తర్వాత తాను ముఖ్యమంత్రిగా కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను పూర్తి చేశానని తెలిపారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణతో నీటిని ఆదా చేసి, తెలంగాణకు 20 టీఎంసీల నీటిని కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేశామని వివరించారు. గోదావరి నదిపై అలీ సాగర్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను కూడా చేపట్టామని తెలిపారు.

Chandrababu Naidu
Andhra Pradesh
Telangana
River water disputes
Godavari River
Krishna River
Polavaram project
Water resources
Telugu states
Irrigation projects

More Telugu News