Uttam Kumar Reddy: పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy Opposes Polavaram Nallamala Sagar Project
  • పోలవరం-నల్లమల లింక్ ప్రాజెక్టును అడ్డుకుంటామన్న మంత్రి ఉత్తమ్
  • ఇది  ట్రైబ్యునల్ అవార్డుకు, నిబంధనలకు విరుద్ధమని స్పష్టీకరణ
  • ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామన్న ప్రభుత్వం
  • సీడబ్ల్యూసీ లేఖపై బీఆర్ఎస్ ఆరోపణలను తోసిపుచ్చిన మంత్రి
  • రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపింది తామేనని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరాఖండిగా చెప్పారు. ఈ ప్రాజెక్టును కచ్చితంగా అడ్డుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్-1980 అవార్డుకు, అంతర్రాష్ట్ర జల నిబంధనలకు స్పష్టంగా విరుద్ధమని అన్నారు.

బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చూపిస్తున్న లేఖ, కేవలం సమాచారం కోసం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పంపిన అంతర్గత లేఖ మాత్రమేనని, దానికి ఆమోదం తెలిపినట్టు కాదని తోసిపుచ్చారు. తెలంగాణ ప్రయోజనాలపై ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఇప్పటికే గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖలకు లేఖలు రాశామని, ఈ సంస్థలన్నీ తెలంగాణ వాదనతో ఏకీభవించాయని తెలిపారు.

ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామని, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని నియమించామని ఉత్తమ్ వెల్లడించారు. నేడు జరగాల్సిన వాదనలు వచ్చే సోమవారానికి వాయిదా పడ్డాయని, రిట్ పిటిషన్‌ను సూట్ పిటిషన్‌గా మార్చి దాఖలు చేయాలని కోర్టు నుంచి సూచన అందిందని తెలిపారు. వచ్చే వాయిదాకు తానే స్వయంగా హాజరై స్టే ఆర్డర్ కోరతామని చెప్పారు. తెలంగాణ మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయించడంలో సఫలమైందని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఆ ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. పదేళ్ల పాలనలో జలవనరుల నిర్వహణలో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
Uttam Kumar Reddy
Polavaram Nallamala Sagar Link Project
Telangana
Andhra Pradesh
Godavari River
Interstate Water Disputes
GRMB
Supreme Court
Revanth Reddy
Harish Rao

More Telugu News