మండలిలో కవిత కంటతడి... తీవ్రంగా స్పందించిన గొంగిడి సునీత

  • కవిత రాజీనామా చేసిన తర్వాత మండలికి వెళ్లి కంటతడి పెట్టారన్న సునీత
  • కవిత జైలుకు వెళితే విడిపించుకు రావడానికి హరీశ్ రావు ఎంతో కృషి చేశారని వెల్లడి
  • కవిత ఎవరో ఆడించినట్లు ఆడుతున్నారన్న సునీత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత, ఇప్పుడు శాసనమండలికి వెళ్లి కంటతడి పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకురాలు గొంగిడి సునీత విమర్శించారు. మద్యం కుంభకోణంలో కవిత జైలుకు వెళ్ళినప్పుడు ఆమెను విడిపించడానికి హరీశ్ రావు ఎంతో కృషి చేశారని ఆమె అన్నారు. కవిత కూర్చున్న కొమ్మను నరుక్కునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. కవిత ఎవరో చెప్పినట్లు ఆడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ భవన్‌లో మహిళా నేతలతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్‌లో ఎంపీ స్థానం నుంచి ఓడిపోతే కవిత బాధను చూడలేక కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని అన్నారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం ఇష్టం లేదన్న కవిత, తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎందుకు మార్చారో చెప్పాలని నిలదీశారు.

పార్టీలో ప్రాధాన్యం లేకుండానే రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను పార్టీ విస్మరించిందనేది అవాస్తవమని అన్నారు. అమరులను స్మరించుకోవడానికే అమరుల జ్యోతిని నిర్మించినట్లు తెలిపారు. కేసీఆర్‌ను విమర్శిస్తూ కవిత తన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆమె అన్నారు.


More Telugu News