ఢిల్లీలో దారుణం.. భర్తపై దాడి, భార్యపై వేధింపులు.. కొడుకును నడిరోడ్డుపై నగ్నంగా మార్చి కొట్టారు!

  • ఢిల్లీ లక్ష్మీనగర్‌లో ఘ‌ట‌న‌
  • జిమ్ యాజమాన్య వివాదమే కారణమని వెల్లడి
  • భర్తను కొట్టి, భార్యపై వేధింపులకు పాల్పడిన దుండగులు
  • కొడుకును నడిరోడ్డుపై వివస్త్రను చేసి చితకబాదిన వైనం
  • ఒక‌రిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ముగ్గురి కోసం గాలింపు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. లక్ష్మీనగర్ ప్రాంతంలో ఓ కుటుంబంపై కొందరు వ్యక్తులు అమానుషంగా దాడికి పాల్పడ్డారు. భర్తను చితకబాది, భార్యపై వేధింపులకు దిగారు. వారి కుమారుడిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా న‌గ్నంగా మార్చి దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. బాధితుడు రాజేశ్‌ గార్గ్, ఆయన భార్య తమ ఇంటి బేస్‌మెంట్‌లో ఒక జిమ్ నిర్వహిస్తున్నారు. ఆ జిమ్‌కు కేర్‌టేకర్‌గా ఉన్న సతీశ్‌ యాదవ్, జిమ్‌ను అక్రమంగా చేజిక్కించుకోవాలని చూశాడని, ఈ క్రమంలోనే గొడవ జరిగిందని బాధితులు ఆరోపించారు. జనవరి 2న బేస్‌మెంట్‌లో నీటి లీక్‌ను పరిశీలించేందుకు గార్గ్ దంపతులు వెళ్లగా, సతీశ్‌ యాదవ్ తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేశాడు.

తనను కిందపడేసి ఇష్టమొచ్చినట్టు కొట్టారని, తన భార్య జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి వేధించారని రాజేశ్ గార్గ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లిదండ్రులను కాపాడేందుకు వారి కుమారుడు అక్కడికి రాగా, నిందితులు అతడిని కూడా వదల్లేదు. అతడిని బయటకు లాక్కెళ్లి, నడిరోడ్డుపై బట్టలు విప్పి ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడి తలకు గాయాలవగా, ఒక పన్ను విరిగింది. రాజేశ్ గార్గ్‌కు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రధాన నిందితుడు సతీశ్‌ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు వికాస్ యాదవ్, శుభమ్ యాదవ్, ఓంకార్ యాదవ్‌లు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.


More Telugu News