Kavitha: వ్యక్తిగా వెళుతున్నా... రాజకీయ శక్తిగా తిరిగి వస్తా: రాజకీయ పార్టీపై కవిత కీలక ప్రకటన

Kavitha Announces New Political Party Telangana Jagruthi
  • తెలంగాణ జాగృతి త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరిస్తుందన్న కవిత
  • వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని వెల్లడి
  • తనది ఆస్తుల పంచాయితీ కాదని, ఆత్మగౌరవ పంచాయితీ అన్న కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై కీలక ప్రకటన చేశారు. తన సంస్థ త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరిస్తుందని, అందరూ తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతోందని, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ప్రకటించారు.

కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. "వ్యక్తిగా సభ నుంచి వెళుతున్నా.. రాజకీయ శక్తిగా తిరిగి వస్తా" అని కవిత ప్రతిజ్ఞ చేశారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆమె ఆరోపించారు. 

రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వేదిక రాబోతుందని, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల కోసం తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు. "అవమాన భారంతో పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకుని మీకోసం వస్తున్నా.. ఆశీర్వదించండి. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది" అని ఆమె పేర్కొన్నారు.

సభ నుంచి బయటకు వచ్చాక కవిత మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారుల కోసం, వారి ఆశయాల కోసం తెలంగాణ జాగృతి పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానిస్తున్నానని ఆమె అన్నారు. అవినీతి, రైతుల మీద కేసులు, బీఆర్ఎస్ సొంత నాయకులపై కేసులు, ఇంకా మరెన్నో బీఆర్ఎస్‌లో జరిగిన అక్రమాల గురించి తాను అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని అన్నారు.

ఈరోజు కుట్రదారులు, తెలంగాణ ద్రోహులు గెలిచారని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ కోసం కడుపు కట్టుకుని పని చేసిన ఏ నాయకుడు ఉండలేకపోయారని అన్నారు. తాను ఊరుకునే వ్యక్తిని కాదని, కొట్లాడే ఆడబిడ్డనని అన్నారు. నాడు బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయాన్ని నేడు కాంగ్రెస్ కూడా కొనసాగిస్తోందని ఆరోపించారు. అందుకే తెలంగాణలో ఒక రాజకీయ వేదిక అవసరమని, తెలంగాణ జాగృతి ఆ ఖాళీని పూర్తి చేస్తుందని అన్నారు.

ఒక ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్న తనను ఆదరించమని ఆమె కోరారు. ఎప్పుడైనా కొత్త రాజకీయ శక్తి వస్తున్నప్పుడు ఇష్టారీతిన ఆరోపణలు చేయడం సహజమే అన్నారు. తాను బీఆర్ఎస్‌లో వాటాలు కుదరక బయటకు వచ్చానని కాంగ్రెస్ అంటోందని, తనతో కాంగ్రెస్ మాట్లాడుతోందని బీఆర్ఎస్ చెబుతోందని, కానీ ఆ వాదనల్లో వాస్తవం లేదని అన్నారు.

తనకు దైవభీతి ఎక్కువ అని, లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, తనది ఆస్తుల పంచాయితీ కాదని, రాజకీయ పంచాయితీ అని అన్నారు. తాను బీసీల గురించి, అవినీతి గురించి మాట్లాడానని గుర్తు చేశారు. మండలి ఛైర్మన్ తన రాజీనామాను ఆమోదిస్తే ప్రజల కోసం పూర్తిగా పోరాడతానని అన్నారు.
Kavitha
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
BRS Party
Telangana Politics
Political Party
Telangana Elections

More Telugu News