నయనతారపై తమిళ తంబీల ఆగ్రహం
- దశాబ్ద కాలంగా ప్రమోషన్లకు దూరంగా నయనతార
- మెగాస్టార్ సినిమా కోసం ప్రమోషన్లలో పాల్గొంటున్న వైనం
- జీర్ణించుకోలేకపోతున్న తమిళ ప్రేక్షకులు, నిర్మాతలు
టాలీవుడ్‌లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ నయనతార హాట్ టాపిక్ గా మారారు. దాదాపు దశాబ్దం పాటు ఏ సినిమా ప్రమోషన్లకూ వెళ్లకుండా, 'నో ప్రమోషన్' పాలసీని గట్టిగా పాటిస్తూ వచ్చిన ఆమె... మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం కోసం మాత్రం ఆ నియమాన్ని పక్కనపెట్టారు. దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి న్యూ ఇయర్ స్పెషల్‌గా విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో నయన్ సరదాగా కనిపించి, స్వయంగా "ప్రమోషన్స్ ఏమీ లేవా?" అని అడగడం చూసి తమిళ సినీ వర్గాలు షాక్‌లో పడ్డాయి. అనిల్ రావిపూడి ఆశ్చర్యంతో నవ్వుతూ, నయన్ ప్రమోషన్లకు ఒప్పుకోవడమే పెద్ద ప్రమోషన్ అని జోక్ చేశారు. చివర్లో చిరు స్టైల్‌లో డైలాగ్ చెప్పి, సినిమా జనవరి 12న రిలీజ్ అని అనౌన్స్ చేయడం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్లపై నయనతార పాల్గొంటుండటం కోలీవుడ్‌లో మాత్రం పెద్ద చర్చనీయాంశం అయింది. తమిళంలో ఎంత పెద్ద హీరోలతో నటించినా, తన సొంత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా ప్రమోషన్లకు రాని నయన్, తెలుగు సినిమా కోసం ఇలా ముందుకు రావడం తమిళ ప్రేక్షకులు, నిర్మాతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో "తమిళ సినిమాలు మీకు టమాటా పచ్చడి లాగా చులకనగా కనిపిస్తున్నాయా?" అంటూ ఘాటు ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. తమిళ నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారని, టాలీవుడ్ పట్ల పక్షపాతం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.