Dharambeer Gokhool: మంగళగిరిలో మారిషస్ అధ్యక్షుడు.. పానకాలస్వామికి ప్రత్యేక పూజలు

Mauritius President Dharambeer Gokhool Visits Mangalagiri Panakala Swamy Temple
  • ఏపీలో ఐదు రోజుల పర్యటనలో ఉన్న ధరమ్‌బీర్ గోఖూల్
  • తెలుగు ఒక గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం అని కొనియాడిన అధ్యక్షుడు
  • నేడు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న మారిషస్ అధ్యక్షుడు
  • రేపు, ఎల్లుండి తిరుమల, శ్రీకాళహస్తి క్షేత్రాల సందర్శన
మారిషస్ అధ్యక్షుడు ధరమ్‌బీర్ గోఖూల్ ఇవాళ‌ మంగళగిరిలోని ప్రసిద్ధ పానకాల నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడికి వచ్చారు. ఆలయానికి చేరుకున్న అధ్యక్షుడికి, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

పర్యటనలో భాగంగా గోఖూల్ ఈరోజు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. అనంతరం మంగళ, బుధవారాల్లో ఆయన తిరుపతి, తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే శ్రీకాళహస్తిలోని ఆలయాలను కూడా సందర్శించనున్నారు.

కాగా, ఆదివారం గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో గోఖూల్ పాల్గొని ప్రసంగించారు. "తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదు, అదొక జీవనాగరికత, గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం" అని ఆయన కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఈ సభలు ఏకం చేస్తున్నాయని అభివర్ణించారు. ప్రస్తుతం 50కి పైగా దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని గుర్తు చేశారు.

మారిషస్‌లో తెలుగు సమాజం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. తమ దేశంలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిలలో తెలుగును అధికారిక విద్యావ్యవస్థలో భాగంగా బోధిస్తున్నామని వివరించారు. భారత్, మారిషస్ మధ్య సంబంధాలు చారిత్రక విలువలు, నాగరికతల కొనసాగింపుపై ఆధారపడి ఉన్నాయని గోఖూల్ స్పష్టం చేశారు.
Dharambeer Gokhool
Mauritius President
Panakala Narasimha Swamy Temple
Mangalagiri
Andhra Pradesh Tour
Chandrababu Naidu
Tirupati
Srikalahasti
World Telugu Conference
Telugu Language

More Telugu News