Pawan Kalyan: తెలంగాణలో జనసేన కమిటీలన్నీ రద్దు
- ప్రస్తుత కమిటీలను రద్దు చేసినట్టు ప్రకటించిన రామ్ తాళ్లూరి
- కొత్తగా అడ్‌హాక్ కమిటీల ఏర్పాటు
- త్వరలోనే శాశ్వత కమిటీలను ఏర్పాటు చేయనున్న జనసేన
తెలంగాణలో జనసేన పార్టీకి కొత్త ఊపిరి పోసేలా హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేస్తున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగాలకు చెందిన కమిటీలను పూర్తిగా తీసేసి, వాటి స్థానంలో తాత్కాలిక అడ్‌హాక్ కమిటీలను నియమించారు.
ఈ అడ్‌హాక్ కమిటీలు మొత్తం 30 రోజుల పాటు పనిచేస్తాయి. ఈ కమిటీ సభ్యులు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 300 వార్డులకు వెళ్లి విస్తృతంగా పర్యటిస్తారు. అక్కడ చురుకైన కార్యకర్తలను గుర్తించి, ప్రతి వార్డు నుంచి కనీసం ఐదుగురు సభ్యుల జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి సమర్పిస్తారు. ఈ నివేదికల ఆధారంగా త్వరలోనే కొత్త శాశ్వత కమిటీలను ప్రకటించి, పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్ఠం చేయనున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణతో తెలంగాణలో జనసేనకు కొత్త జోష్ వచ్చి, క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం ఏర్పడుతుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. పవన్ నాయకత్వంలో పార్టీ మరింత చురుగ్గా ముందుకు సాగుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.