Harish Rao: హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్, రాధాకిషన్ రావులకు ఊరట
- వీరిపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం
- హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. హరీశ్, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది.
గతంలో తెలంగాణ హైకోర్టు హరీశ్ రావు, రాధాకిషన్ రావులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేసిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో హరీశ్ రావు ఈ కేసు నుంచి ఊరటపొందినట్టయింది. బీఆర్‌ఎస్ నేతలు దీన్ని పెద్ద విజయంగా చూస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ కక్షతో కేసులు పెడుతోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తీర్పుపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.