తన జ్యోతిష్యం నిజం అవుతుందని నమ్మించడానికి ఐఫోన్ చోరీ!

  • యువతికి కష్టకాలం వస్తుందని జోస్యం చెప్పి, ఆమె ఫోన్ దొంగిలించిన జ్యోతిష్యుడు
  • ఐఫోన్ పోవడమే తన జ్యోతిష్యానికి నిదర్శనమని బుకాయించిన నిందితుడు
  • బ్యాగులో ఫోన్ దొరకడంతో నిందితుడిని అరెస్ట్ చేసిన థాయ్‌లాండ్ పోలీసులు
  • గతంలో బెంగళూరులోనూ జ్యోతిష్యుడి వేషంలో బంగారం చోరీ చేసిన మరో ఘరానా దొంగ
తాను చెప్పిన జోస్యం నిజం కావాలని ఓ జ్యోతిష్యుడు దొంగగా మారిన ఘటన థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో జరిగింది. జనవరి 1న స్థానిక ఆలయం వద్ద ఉడోమ్ సాప్ మ్యూంగ్‌కాయూ (38) అనే వ్యక్తి జ్యోతిష్యం చెబుతూ కూర్చున్నాడు. పిమ్ అనే 19 ఏళ్ల యువతి తన భవిష్యత్తు తెలుసుకోవడానికి అతని వద్దకు వెళ్లగా, ఆమెకు త్వరలో గండం పొంచి ఉందని, ఒక విలువైన వస్తువును కోల్పోబోతున్నావని హెచ్చరించాడు. ఆ గండం గడవాలంటే కొంత డబ్బు ఇస్తే పరిహారం చేస్తానని చెప్పాడు. అయితే ఆమె అందుకు నిరాకరించి అక్కడి నుంచి బయలుదేరింది.

కొంత దూరం వెళ్లాక తన ఐఫోన్ 13 ప్రో కనిపించకపోవడంతో.. ఇంతకు క్రితం జ్యోతిష్యుడితో మాట్లాడుతున్నప్పుడు దానిని అక్కడ పెట్టిన విషయం గుర్తుకు వచ్చి.. పిమ్ వెనక్కి వచ్చి జ్యోతిష్యుడిని అడిగింది. దానికి అతడు ఏమాత్రం తడబడకుండా.. "చూశావా! నేను చెప్పినట్టే నీకు కష్టకాలం మొదలైంది, నీ ఫోన్ పోవడమే నా జ్యోతిష్యానికి నిదర్శనం" అని బుకాయించాడు.

అంతేకాకుండా దొంగ ఇలా ఉంటాడని వర్ణించి రూపురేఖలు కూడా చెప్పాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు రంగు బయటపడింది. పోలీసులు అతడి బ్యాగును సోదా చేయగా, మాస్కుల బాక్సులో దాచిన ఐఫోన్ దొరికింది. కొత్త సంవత్సరం డబ్బుల కోసం ఈ పని చేశానని నిందితుడు ఒప్పుకోవడంతో అతడిని అరెస్ట్ చేశారు.

జ్యోతిష్యుడి వేషంలో మోసాలకు పాల్పడటం కొత్తకాదు. 2024 మార్చిలో బెంగళూరులో బీఎం వెంకటరమణ అనే వ్యక్తి జ్యోతిష్యుడిలా నటించి ఓ మహిళను నమ్మించాడు. ఆమె ఇంట్లో దోషాలు ఉన్నాయని, పూజ చేయాలని నమ్మించి ఆమె నగలను ఓ కుండలో వేయించాడు. మంత్రాలు చదువుతున్నట్లు నటిస్తూ.. బియ్యం ఉన్న మరో కుండతో నగలున్న కుండను మార్చేసి 8 లక్షల విలువైన బంగారంతో ఉడాయించాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిని 2025 జనవరి 10న అరెస్ట్ చేసి, తాకట్టు పెట్టిన నగలను స్వాధీనం చేసుకున్నారు. 


More Telugu News