Asim Munir: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ను అరెస్ట్ చేయండి.. డొనాల్డ్ ట్రంప్‌కు బలోచ్ నేత విజ్ఞప్తి

Baloch Leader Tara Chand Urges Trump to Arrest Pakistan Army Chief Asim Munir
  • వెనిజువెలా తరహాలో బలోచిస్థాన్ లో కూడా జోక్యం చేసుకోవాలని అమెరికాకు విన్నపం
  • పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కూడా మదురోలాగే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
  • బలోచిస్తాన్ వనరులను చైనాకు తాకట్టు పెడుతున్నారని బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ ఆరోపణ
  • పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రంప్‌కు బహిరంగ లేఖ
వెనిజువెలాలో నియంతృత్వానికి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్నే బలోచిస్థాన్ విషయంలోనూ అమలు చేయాలని బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ (బీఏసీ) అధ్యక్షుడు డాక్టర్ తారా చంద్ కోరారు. వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో తరహాలోనే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ వ్యవహరిస్తున్నారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మదురో తన దేశ సహజ వనరులను చైనాకు అప్పగించి దోపిడీకి ఎలా సహకరించారో, అదే విధంగా అసీమ్ మునీర్ బలోచిస్థాన్ లోని అపారమైన ఖనిజ సంపద, తీరప్రాంత వనరులను చైనాకు తాకట్టు పెడుతున్నారని తారా చంద్ ఆరోపించారు. మునీర్ ఒక 'డబుల్ ఏజెంట్'లా వ్యవహరిస్తూ, ఒకవైపు బలోచ్ వనరులను చైనాకు కట్టబెడుతూనే, మరోవైపు అమెరికాను తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. మదురోపై అమెరికా ఇటీవల జరిపిన మెరుపు దాడి తరహాలోనే, పాక్ ఆర్మీ చీఫ్‌ను కూడా అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పాకిస్థాన్ మిలిటరీ కేవలం బలోచిస్థాన్‌లోనే కాకుండా సరిహద్దుల వెలుపల కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తారా చంద్ విమర్శించారు. బలోచిస్థాన్‌లో ప్రతిరోజూ సామాన్యుల హత్యలు, అదృశ్యాలు కొనసాగుతున్నాయని, ఇవి మానవత్వానికే మాయని మచ్చ అని పేర్కొన్నారు. గతంలో ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చి కూడా అమెరికా నుంచి పాక్ నిధులు పొందిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న బలోచ్ అమెరికన్ కాంగ్రెస్, బలోచిస్థాన్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతోంది. దీని అధ్యక్షుడు డాక్టర్ తారా చంద్ గతంలో బలోచిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతూ బలోచ్ ప్రజల హక్కుల కోసం అంతర్జాతీయ వేదికలపై గళమెత్తుతున్నారు.  
Asim Munir
Donald Trump
Balochistan
Pakistan Army
Tara Chand
Baloch American Congress
China
Human Rights
Terrorism
Venezuela

More Telugu News