Rajasthan Royals: జైపూర్‌కు రాజస్థాన్ గుడ్ బై.. ఆర్ఆర్‌ కెప్టెన్‌గా జడేజా!

Ravindra Jadeja Likely to Captain Rajasthan Royals IPL 2026
  • ఐపీఎల్ 2026లో పుణెలో ఆడనున్న రాజస్థాన్ రాయల్స్
  • రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌తో విభేదాల వల్లే ఈ నిర్ణయం
  • ఇప్పటికే పుణె స్టేడియాన్ని పరిశీలించిన ఫ్రాంచైజీ యాజమాన్యం
  • కెప్టెన్సీ రేసులో రవీంద్ర జడేజా పేరు ప్రముఖంగా ప్రస్తావన
  • త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమ సొంత మైదానమైన జైపూర్‌ను కాదని, కొన్ని హోమ్ మ్యాచ్‌లను పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియంలో నిర్వహించేందుకు ఫ్రాంచైజీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐఏఎన్ఎస్ తన కథనంలో పేర్కొంది.

రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ)తో ఫ్రాంచైజీకి ఉన్న విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతేడాది ఐపీఎల్ 2025 సమయంలో ఓ ఆర్‌సీఏ అధికారి ఫ్రాంచైజీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ ఆరోపణలను రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం ఆర్‌సీఏను తాత్కాలిక కమిటీ నడుపుతుండటం కూడా ఈ మార్పునకు మరో కారణంగా కనిపిస్తోంది.

ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ ప్రతినిధులు పుణె స్టేడియాన్ని, అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని, బీసీసీఐ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజస్థాన్ జట్టుకు గువాహ‌టిలోని బర్సపరా స్టేడియం రెండో హోమ్ గ్రౌండ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు మైదానం మార్పుతో పాటు కెప్టెన్సీపైనా జట్టులో చర్చ జరుగుతోంది. సంజూ శాంసన్ తర్వాత తదుపరి కెప్టెన్‌గా రవీంద్ర జడేజా పేరు బలంగా వినిపిస్తోంది. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ట్రేడ్ ద్వారా రాజస్థాన్ జట్టులోకి వచ్చిన జడేజా, గతంలో 2008-09లోనూ ఈ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. పుణెలోని ఎంసీఏ స్టేడియం గతంలో పుణె వారియర్స్ ఇండియా, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ వంటి జట్లకు హోమ్ గ్రౌండ్‌గా సేవలందించింది.
Rajasthan Royals
IPL 2026
Ravindra Jadeja
Sanju Samson
Jaipur
Pune
Yashasvi Jaiswal
Riyan Parag
Rajasthan Cricket Association
Sawai Mansingh Stadium

More Telugu News