పోలవరంపై ఏపీతో న్యాయపోరాటం... సుప్రీంలో వాదనలకు తెలంగాణ సర్కారు సిద్ధం

  • పోలవరం విస్తరణపై ఏపీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ
  • గోదావరి జలాల్లో తమ వాటా కోసం న్యాయపోరాటానికి సిద్ధం
  • ముంబైలో సీనియర్ న్యాయవాదితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ భేటీ
  • అక్రమ విస్తరణ పనులు ఆపాలని పిటిషన్‌లో విజ్ఞప్తి
  • ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు నిలిపేయాలని కోరిన తెలంగాణ
గోదావరి నదీ జలాల్లో తమకు దక్కాల్సిన వాటా విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు విస్తరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పనులను తాము అంగీకరించలేది లేదంటూ, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో సీనియర్ న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకించేందుకు న్యాయపరమైన చర్యలను తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయ్యారు. కోర్టులో రాష్ట్రం తరఫున సమర్థవంతమైన, బలమైన వాదనలు వినిపించాలని వారు న్యాయ నిపుణులను కోరారు. అవసరమైన అన్ని పత్రాలు, ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం కార్యాలయం అప్రమత్తం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టును బనకచర్ల లేదా నల్లమల సాగర్‌తో అనుసంధానించే విస్తరణ పనులను ఏపీ ప్రభుత్వం చేపడుతోందని పిటిషన్‌లో ఆరోపించింది. ఈ పనులను తక్షణమే ఆపాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని కోరింది. ఆమోదించిన అసలు డిజైన్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలని స్పష్టం చేసింది.

తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నల్లమల సాగర్ ప్రాజెక్టు నివేదికలను పరిశీలించడాన్ని కూడా పిటిషన్‌లో తప్పుబట్టింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేస్తోందని, ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఆర్థిక సహాయం నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ పిటిషన్ త్వరలో సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.


More Telugu News