Bangladesh Cricket: భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో మేం పాల్గొనడంలేదు: బంగ్లాదేశ్ సంచలన ప్రకటన

Bangladesh Cricket Boycotts T20 World Cup in India
  • ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహం
  • భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి
  • బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశం
భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్ మైదానానికి కూడా పాకాయి. రాబోయే టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు వెళ్లకూడదని బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ యువజన, క్రీడల శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసిన బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను.. బీసీసీఐ సూచనల మేరకు జట్టు నుంచి తప్పించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో, ముస్తాఫిజుర్‌ను భారత్‌లో ఆడనివ్వకూడదని పలువురు డిమాండ్ చేయడంతో బీసీసీఐ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అత్యవసర సమావేశం నిర్వహించి, భారత్‌ పర్యటనను బహిష్కరించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆసిఫ్ నజ్రుల్ ఫేస్‌బుక్ ద్వారా స్పందిస్తూ.. "భారత క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న దూకుడు విధానాల వల్లే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. కాంట్రాక్టు ఉన్న ఆటగాడికే అక్కడ అనుమతి లేనప్పుడు, మా జాతీయ జట్టుకు అక్కడ రక్షణ ఉంటుందని మేము భావించడం లేదు" అని పేర్కొన్నారు.

తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఫిబ్రవరిలో కోల్‌కతా, ముంబై వేదికగా జరగాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లిఖితపూర్వకంగా కోరతామని ఆయన తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7 నుంచి 17 మధ్య బంగ్లాదేశ్.. వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్‌లతో ఆడాల్సి ఉంది. మరోవైపు, బంగ్లాదేశ్ క్రికెట్‌ను, క్రికెటర్లను అగౌరవపరిస్తే సహించేది లేదని స్పష్టం చేసిన నజ్రుల్.. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని సమాచార ప్రసారాల శాఖను ఆదేశించారు.
Bangladesh Cricket
T20 World Cup
India Bangladesh Relations
Mustafizur Rahman
BCCI
Asif Nazrul
Kolkata Knight Riders
Cricket Boycott
Hindu Attacks Bangladesh

More Telugu News